ఐటెమ్ పాటంటేనే ఓ కమర్షియల్ హంగు. సినిమాకి జోష్ తెచ్చే ఐటెమ్. అయితే… ఎంత ఐటెమ్ గీతమైనా.. కథలో భాగంగా వచ్చినప్పుడే బాగుంటుంది. `ఇక్కడ ఐటెమ్ పాటని అనవసరంగా ఇరికించేశార్రా.` అనే ఫీలింగ్ వస్తే.. ఐటెమ్ పాట ఎంత బాగున్నా… కిక్ ఇవ్వదు. సినిమా అంతా చూసుకొని… `ఇక్కడ జోష్ లేదోయ్.. ఇంకేదో కావాలి..` అనుకొని, అప్పుడు ఐటెమ్ పాట సెట్ చేసుకోవడం ఈమధ్య కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.
ఎఫ్ 3 ప్లానింగ్ లో ఐటెమ్ గీతం లేదు. చివర్లో, సినిమా అంతా అయిపోయిన తరవాత… ఎగస్ట్రా జోష్ కోసం ఆ పాటని తీసుకొచ్చి ఇరికించారు. అయితే పార్టీ సాంగ్ కావడంతో, దేవిశ్రీ మంచి ట్యూన్ ఇవ్వడంతో, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ ని తీసుకుని రావడంతో ఆ పాట వర్కవుట్ అయ్యింది. సినిమా కూడా హిట్టయ్యింది. కాబట్టి, ఆ పాట కోసం ఎంత ఖర్చు పెట్టినా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.
రామారావు ఆన్ డ్యూటీ కోసం `సీసా` అనే ఓ ఐటెమ్ పాటని ఇటీవల విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈపాట కొంచెం క్యాచీగానే ఉంది. అయితే.. ఈ పాటని కూడా చివరి క్షణాల్లో యాడ్ చేశారు. అదీ గ్లామర్ కోసం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అయినా సరే, ఎగస్ట్రా గ్లామర్ కావాలనుకుంది చిత్రబృందం. అందుకే అప్పటి కప్పుడు.. ఈ పాటని సెట్స్‌పైకి తీసుకెళ్లాల్సివచ్చింది.
ఇప్పుడు నితిన్ సినిమా `మాచర్ల నియోజక వర్గం` కూడా ఇదే ఎత్తుగడ వేశారు. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. కృతి శెట్టి కథానాయిక. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ. గ్లామర్‌కి అంత స్కోప్ లేదు. కృతి శెట్టి లాంటి అందాల కథానాయిక ఉన్నా.. ఆమె పాత్ర కూడా కథ ప్రకారమే నడుచుకుంటుంది. కాబట్టి… గ్లామర్ పార్ట్ భర్తీ కాలేదు. అందుకోసం చివరి నిమిషాల్లో అంజలిని తీసుకొచ్చారు. అంజలి ఇప్పటి వరకూ ఐటెమ్ గీతమేమీ చేయలేదు. తనకు ఇది కొత్తగానే ఉంటుంది. అంజలి రాకతో.. ఈ సినిమా ప్రమోషన్లకు కాస్త జోష్ వచ్చినట్టైంది.
ఇలా చివరి నిమిషాల్లో పాట వచ్చి కూర్చోవడం వల్ల నిర్మాతలకు బాగా ఇబ్బందైపోతుంది. అదో అదనపు ఖర్చు. సినిమా హిట్టయి, లాభాలొస్తే… ఈ ఖర్చు అస్సలు లెక్కలోకి రాదు. అదే అటూ ఇటూ అయితే… ఇంత ఖర్చు, కష్టం.. బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ విషయాన్ని నిర్మాతలు గమనించుకొంటే మంచిది.