ఇది వరకు ఏ సినిమాలో ఏ హీరోయిన్ని తీసుకోవాలా? అని దర్శక నిర్మాతలు తర్జన భర్జనలు పడేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్యలో హీరోయిన్లు లేకపోవడం, స్టార్ హీరోల క్రేజ్‌కు సరిపడా కథానాయికలు దొరక్కపోవడంతో ఇదో పెద్ద సమస్యగా ఉండేది. అది ఇప్పుడు ఐటెమ్ గాళ్స్ కి కూడా షిఫ్ట్ అయ్యింది. బడా సినిమాల్లో ప్రత్యేక గీతాలు తప్పనిసరి. అయితే ఇది వరకటిలా.. ఎవర్నో ఒకర్ని రంగంలోకి దింపేసి ‘ఇదే మా ఐటెమ్ సాంగ్’ అంటే సరిపోదు. ఆ పాటలో కిక్ ఉండాలి. తెరపై ఆడిపాడే కథానాయికలకు ‘పాన్ ఇండియా’ క్రేజ్ ఉండాలి. స్టార్ హీరోల సినిమాలకు ఐటెమ్ గాళ్స్ ఎంపిక ఓ పెద్ద సమస్యగా మారిపోయింది.
‘పుష్ష 2’లో ఓ ప్రత్యేక గీతం ఉంది. ఇందులో ఎవర్ని తీసుకోవాలా? అని సుకుమార్ ఏకంగా మూడు నెలలుగా ఆలోచిస్తూనే ఉన్నాడు. సుకుమార్ స్థాయికి, పుష్ష 2కి ఉన్న క్రేజ్‌కి దేశంలో ఏ కథానాయిక అయినా సరే… స్పెషల్ ఎప్పీరియన్స్లో కనిపించడానికి ముందుకు వస్తుంది. కానీ అలాంటిలాంటి కథానాయికని తీసుకొస్తే కిక్ ఏముంది? ‘పుష్ష’ లో సమంత సర్ప్రైజ్ చేసినట్టు… ఇప్పుడూ ఏదో ఓ మ్యాజిక్ జరగాలి. ఇప్పటి వరకూ ఐటెమ్ పాట జోలికి వెళ్లని కథానాయికని తీసుకురావాలి. ఇదే సుక్కు గోల్. అందుకే తీవ్ర స్థాయిలో వేట జరుగుతోంది.
ప్రభాస్ – మారుతి చిత్రం ‘రాజాసాబ్’లోనూ ఓ అదిరిపోయే ప్రత్యేక గీతం ఉంది. ఇప్పటికే పాట రికార్డింగ్ కూడా జరిగిపోయింది. కానీ షూటింగ్ పెట్టుకోలేదు. కారణం… ఐటెమ్ గాళ్‌గా ఎవరిని తీసుకురావాలో తేల్చుకోలేకపోవడం. ప్రభాస్ తో పాటంటే కచ్చితంగా బాలీవుడ్ భామలే దిగి రావాలి. ప్రభాస్ హైటుకీ, తన క్రేజ్కీ సరిపడా కథానాయికని ఎంచుకోవాలి. తెరపై ప్రభాస్‌తో ఎవరి కెమిస్ట్రీ అదిరిపోతుందా? అనే దిశగా మారుతి అండ్ టీమ్ తెగ ఆలోచించేస్తోంది.
ఎన్టీఆర్ ‘దేవర’లో ఓ ప్రత్యేక గీతం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం చాలామంది కథానాయికల పేర్లు పరిశీలిస్తున్నారు. `గేమ్ ఛేంజర్`లోనూ స్పెషల్ సాంగ్ కి చోటుంది. ఆ పాటలో ఎవరు కనిపిస్తారన్నది ఇంకా తేలలేదు. ప్రస్తుతం అందుకోసమే అన్వేషణ జరుపుతున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్.. వీళ్లంతా స్టార్ హీరోలే. వీళ్ల పక్కన ఎవరు చిందేసినా… థియేటర్లలో పూనకాలు మొదలైపోతాయి. కాకపోతే… ఎవరు ఎవరితో స్టెప్పేస్తారన్నదే కీలకం.