కేంద్ర ప్రభుత్వం తెలంగాణా పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని తెరాస నేతలు తరచూ ఆరోపించడం అందరూ వింటున్నదే. కానీ తెదేపా-బీజేపీ కూటమికి ఓటేసి గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కూడా మోడీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమనే చూపిస్తోంది. మోడీ ప్రభుత్వం ఇంతవరకు అనేక హామీలను అటకెక్కించింది. ఇప్పుడు మరో హామీని కూడా అటకెక్కించినట్లు తెలుస్తోంది. అదే…రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధి కోసం ప్రతిపాదించిన ఐటి.ఐ.ఆర్. ప్రాజెక్టు.
రాష్ట్ర విభజన సమయంలోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ లో ఐటి.ఐ.ఆర్. ప్రాజెక్టుకి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం నగరంలో 40.3 చదరపు కిమీ విస్తీర్ణం గల స్థలాన్ని కేటాయించారు. దానిలో కేంద్రప్రభుత్వం 25సం.ల వ్యవధిలో రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది. ముందుగా రూ.5000 కోట్లు పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతంలో ఐటి రంగం కోసం అవసరమయిన అన్ని హంగులు కల్పిస్తుంది. అన్ని విధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్ లోనే మళ్ళీ అటువంటి బారీ ప్రాజెక్టుని కేంద్రం నెలకొల్పడానికి సిద్దమయినప్పుడు, అటువంటిదే ఆంద్రాలో కూడా నెలకొల్పాలని ఒత్తిడి చేయడంతో కేంద్రం అందుకు అంగీకరించింది.
ఐటి.ఐ.ఆర్.ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో సుమారు 12,000 ఎకరాలను కేటాయించింది. రెండేళ్ళ క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐటి.ఐ.ఆర్. ప్రాజెక్టు ఏర్పాటు కోసం ప్రముఖ ఛార్టడ్ అకౌంటన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ చేత ఒక సమగ్ర నివేదిక తయారు చేయించి కేంద్రానికి పంపింది. అప్పటికే విశాఖ నగరంలో చాలా ఐటి సంస్థలు కొలువు దీరి ఉన్నాయి కనుక ఈ ఐటి.ఐ.ఆర్. ప్రాజెక్టు కూడా వచ్చినట్లయితే రాష్ట్రానికి ఐటి దిగ్గజాలన్నీ తరలివస్తాయని అందరూ ఆశించారు.
కానీ కేంద్ర ఐటి మరియు సమాచార శాఖ ఈ ప్రాజెక్టు ఏర్పాటుకి ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలు మార్చి కొత్తగా మార్గదర్శకాలను జారీ చేయాలనుకొంటోంది. కనుక విశాఖలో ఐటి.ఐ.ఆర్. ప్రాజెక్టు కోసం కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఆ నివేదిక చెత్తబుట్టలోకి చేరిపోయినట్లే భావించవచ్చును. కనుక ఆ ప్రాజెక్టు కూడా అటకెక్కినట్లే భావించవచ్చును. కేంద్ర ఐటి మరియు సమాచార శాఖ ఆ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఇంకా ఎప్పుడు కొత్త మార్గదర్శకాలు సిద్దం చేస్తుందో తెలియదు. అది జారీ అయితే దానిని బట్టి విశాఖలో ఐటి.ఐ.ఆర్. ప్రాజెక్టు ఏర్పాటు కోసం మళ్ళీ కొత్తగా నివేదిక తయారుచేసి కేంద్రానికి పంపవలసి ఉంటుంది. ఇప్పటికే రెండేళ్ళు పూర్తయిపోతున్నాయి. మిగిలిన మూడేళ్ళలోనయినా ఈ తతంగం అంతా పూర్తయ్యి ప్రాజెక్టు ఆమోద ముద్ర వేసుకొని మొదలవుతుందో లేదో తెలియదు. లేదా వచ్చే ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమికి ఓటు వేస్తే ఈ ఐటి.ఐ.ఆర్. ప్రాజెక్టు మంజూరు చేస్తామని హామీ ఇస్తారో చూడాలి.