మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. మౌనముని అంటూ ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్నారు. సోనియా గాంధీ ఆడిస్తున్నట్టు ఆడే ప్రధాని అనీ చాలామంది అనేవారు. కానీ, ఇప్పుడా మౌనమునే మాటకు మాట అన్నట్టుగా నరేంద్ర మోడీని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూ ఉండటం గమనించదగ్గ విషయం. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో మోడీ పాలనపై ఆయన చేస్తున్న విమర్శలకు ప్రాధాన్యత సంతరించుకుంటోంది. తాను మౌనముని కాదనీ, దేశంలోని సమస్యలపట్ల మాట్లాడే ధైర్యం లేక మోడీ మౌనంగా ఉంటున్నారంటూ ఈ మధ్యనే నిలదీశారు. సోమవారంనాడు బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ.. మోడీ సర్కారు వైఫల్యాలపై మరోసారి మన్మోహన్ ఫైర్ అయ్యారు.
ఎన్నికల ప్రచారంలో మోడీ ఉపయోగిస్తున్న భాష దిగజారుడుగా ఉందనీ, గతంలో ప్రత్యర్థుల పట్ల ఏ ప్రధానీ ఈ స్థాయిలో దుర్భాషలాడలేదని విమర్శించారు. మోడీ ఆర్థిక విధానాలు దేశానికి వినాశకరంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో బ్యాంకు మోసాలు అలవాటుగా మారిపోయాయనీ, వేల కోట్ల సొమ్మును కాజేసినవారు కూడా చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. దేశంలో బ్యాంకింగ్ పై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందనీ, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు వంటివి అత్యంత అనాలోచిత నిర్ణయాలన్నారు. దేశంలోని ప్రతీ సమస్యకూ కాంగ్రెస్ కారణమని విమర్శించడం వారికి అలవాటుగా మారిపోయిందనీ, తనను తాను మేధావి అని భావించే మోడీ… ఈ దేశ సంక్లిష్టతనూ విభిన్నతనూ అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయనీ, రైతులకీ, యువతకీ భవిష్యత్తపై భరోసా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో మన్మోహన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ఒక నాయకుడిగా కాకపోయినా, ఆర్థికవేత్తగా మన్మోహన్ కి దేశంలో మంచి గుర్తింపే ఉంది. 1990 దశకంలో పీవీ నరసింహరావు, మన్మోహన్ నేతృత్వంలోని సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ముందుకు నడిపించాయో అందరికీ తెలిసిందే. సో.. ప్రస్తుత భాజపా సర్కారు నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా తూట్లు పొడుస్తున్నాయో చూస్తున్నదే. ఈ నేపథ్యంలో మన్మోహన్ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరిగింది. దేశ ఆర్థిక పరిస్థితులపై ఆయనకి ఉన్నంత సాధికారత ఇతర కాంగ్రెస్ నేతలకు లేదనే చెప్పాలి. పైగా, రాహుల్ గాంధీ ఇలాంటి అంశాలపై మాట్లాడితే… అవి కేవలం విమర్శలుగా మాత్రమే వినిపిస్తాయి. అవే అంశాలపై మన్మోహన్ మాట్లాడుతుంటే.. ఆలోచించ దగ్గ అంశాలే కదా అనే అభిప్రాయం సామాన్యుల్లో కూడా కలుగుతోంది. సరిగ్గా, ఇదే ఇమేజ్ ఇప్పుడు కాంగ్రెస్ కి అనుకూలంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి, మోడీకి ధీటుగానే మన్మోహన్ ప్రచారం సరైన వ్యూహంగానే ప్రస్తుతానికి కనిపిస్తోంది.