దేశంలో హై ప్రోఫైల్ కేసుల్లో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డివి మొదటి స్థానంలో ఉంటాయి. రాజకీయ నేతలు దొరికిపోయి జైళ్లకు వెళ్లిన ఇతర బడా స్కాముల్లో డబ్బులు చేతులు మారినట్లుగా ఎక్కడా కనకిపెట్టలేకపోయారు. టూ జీ స్కాములో లక్షల కోట్లు అన్నారు కానీ ఎవరికి నగదు బదిలీ అయిందో చూపించలేకపోయారు. డబ్బులు దోచేసిన అడ్డంగా దొరికిపోయిన సురేష్ కల్మాడి లాంటి వాళ్లు జైళ్లకు వెళ్లారు. కానీ జగన్ రెడ్డి మాత్రం.. ఓ కొత్త తరహా దోపిడీని బహిరంగంగా చేసి మరీ న్యాయవ్యవస్థతో ఆటలాడుకుంటున్నారు. తన కేసుల విచారణ ముందుకు సాగకుండా పిటిషన్లతో కొడుతున్నారు.
జగన్ రెడ్డి దోచుకుంది ప్రజల సంపద. ఆయన అనుభవిస్తున్నది ప్రజల సంపద. ఓ వైపు ఆక్రమాస్తుల్ని .. ముఖ్యంగా ప్రజల సంపదను అనుభవిస్తూ.. వాటితోనే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారంటే.. అది వ్యవస్థలకే అవమానం. జగన్ రెడ్డి అవినీతి కళ్ల ముందే ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా ఆస్తులను వారికి రాసిచ్చి.. సంపదను దోచిపెట్టి .. దానికి ప్రతిఫలంగా నిధుల్ని పెట్టుబడుల రూపంలో తన ఖాతాలో వేసుకున్నారు. రూపాయి కూడా విలువ చేయని షేర్లను వేలకు విలువ కట్టి మాయ చేశారు. ఇలాంటి మాయలకు.. దోపిడీకి శిక్ష వేయకపోతే.. ఇక నుంచి అందరూ అదే చేస్తారు. ప్రజాఆస్తుల్ని పందికొక్కుల్లా మింగేసి.. అందర్నీ జగన్ ను ఆదర్శంగా చూపిస్తారు.
మన దేశంలో కోర్టు కేసులు అంత త్వరగా తేలవు. కానీ ఓ సారి తప్పు చేసిన వారు .. అయ్య బాబోయ్ అనేలా వ్యవస్థ టార్చర్ పెడుతుంది. వాయిదాలు.. లాయర్లు..ఇలా జీవితాంతం .. కేసు తేలే వరకూ శిక్ష అనుభవిస్తూనే ఉండాలి. కానీ ఇది సామాన్యులకే. పెద్దలకు అయితే విచారణకు కూడా హాజరు కావాల్సిన అవసరం లేదన్న ఉత్తర్వులు వచ్చేస్తాయి. వారు హాయిగా తాము దోచేసుకున్న దాంట్లో కొద్దిగా లాయర్లకు ఖర్చు పెట్టి మిగతా సంపదను.. అనుభవిస్తూ అవకాశం వస్తే అదే రీతిన మరింతగా దోచుకునేందుకు ప్రయత్నిస్తారు. పదేళ్ల పాటు జరిగింది ఇదే.
వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఉండేది.. తప్పు చేసిన వారిని శిక్షించినప్పుడే. వారు అలా యథేచ్చగా తప్పించుకుని తిరిగే అవకాశం ఇచ్చి… అసలు కేసుల విచారణే జరగకపోతే.. ప్రజలు నమ్మకం కోల్పోతారు. అది మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.