కొద్ది వారాల కిందట నాగబాబు, నటుడు మరియు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ను టార్గెట్ గా చేసుకుని ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. బాలయ్య గురించి రిపోర్టర్ అడిగితే, కావాలనే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలయ్య గురించి నాగబాబు మాట్లాడారు. ఆయన గురించి అడగడం లేదని, నటుడు బాలకృష్ణ గురించి అడుగుతున్నానని రిపోర్టర్ వివరణ ఇస్తే, బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని నాగబాబు వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. అయితే అక్కడితో ఆగకుండా బాలకృష్ణ ను మళ్లీ కెలికిన నాగబాబు, బాలకృష్ణ ఎవరో తెలియదు అనడం తప్పేనని, బాలకృష్ణ ఎవరో తనకు తెలుసని అంటూ పాతకాలం హాస్యనటుడు వల్లూరి బాలకృష్ణ ఫోటో చూపించాడు. దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. ఇక్కడ నుండి వివాదం పెద్దదయింది.
అయితే ఆ తర్వాత నాగబాబు ఆ వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ సీరియల్ ని తలపించేలా గా ఒక్కొక్క కామెంట్ తో వీడియోలు పోస్ట్ చేస్తూ, మొత్తం ఆరు కామెంట్లను బాలకృష్ణ మీద వదిలారు. ఈ ఆరు వీడియోలను చూసిన తర్వాత బాలకృష్ణ ఎవరో తెలియదని నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏదో యథాలాపంగా చేసినవి కావని, పూర్తిస్థాయి హోం వర్క్ చేసిన తర్వాతే, చాలా ప్రణాళికాబద్ధంగా ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. అయితే గత ఆరేళ్లలో నందమూరి బాలకృష్ణ అడపాదడపా చిరంజీవిని ఉద్దేశించి కానీ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కానీ జనసేన ను ఉద్దేశించి కానీ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటన్నింటికీ సమాధానంగా నాగబాబు ఈ ఎపిసోడ్ అంతటినీ ప్లాన్ చేశారు అని అర్థమవుతోంది. ఇంతకీ బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆరు సందర్భాలు ఏంటో చూద్దాం:
1. హెచ్ఎం టివిలో ‘పవన్ కల్యాణా? అతనెవరో నాకు తెలియదు’ అని బాలకృష్ణ వ్యాఖ్యలు:
అనంతపురం లో ఒక సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి హెచ్ఎం టీవీ రిపోర్టర్ బాలకృష్ణ ని స్పందించాల్సిందిగా కోరారు. అప్పుడు బాలకృష్ణ సమాధానమిస్తూ ‘పవన్ కల్యాణా? అతనెవరో నాకు తెలియదు’ అన్నారు. హెచ్ఎంటీవీ వీడియో క్లిప్ లేకపోతే బాలకృష్ణ అలా అన్నట్టు కూడా చాలామందికి తెలియదు.
దీనిి పై నాగబాబు స్పందిస్తూ, “తప్పులేదు.. కల్యాణ్‌బాబు కానీ, చిరంజీవిగారు కానీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. దాన్ని నేనసలు తప్పుగా ఫీలవను. నేను తప్పుగా ఫీలయిందేంటంటే.. ఏ పవన్ కల్యాణ్ అయితే మీ తెలుగుదేశం పార్టీకి.. మీ బావ వచ్చి అడిగితే.. తను కంటెస్ట్ చేయకుండా.. మీకు మద్దతు ఇచ్చి, జగన్ గెలవాల్సిన పరిస్థితుల్లో మీ గెలుపునకు కారణం అయ్యారో, ఆ వ్యక్తిని ‘ఎవరో నాకు తెలియదు’ అన్నారు చూశారా! ఇది నన్ను బాధించింది. ” అంటూ వ్యాఖ్యానించారు.
2. ఎన్టీవీ లో, ‘వాళ్ళని హీరోలని చేయవలసిన అవసరం లేదు’ అని పవన్ ని ఉద్దేశించి బాలయ్య వ్యాఖ్యలు
ఒకసారి ఎన్ టీవీ రిపోర్టర్ ‘పవన్ కల్యాణ్ ఇట్లా కామెంట్ చేశాడు, మీ ఓపెనియన్ ఏంటి? ‘ అని అడిగితే బాలకృష్ణ, “మాకు మేమే స్టార్లం. సూపర్ స్టార్లం. వాళ్ళ వ్యాఖ్యలపై స్పందించి వాళ్ళని హీరోలని చేయవలసిన అవసరం లేదు.” అంటూ స్పందించాడు.
బాలకృష్ణ్ణ మాట్లాడిిన వ్యాఖ్యలని గుర్తు చేస్తూ నాగబాబు, “పవన్ కల్యాణ్ కరెక్ట్‌గా మాట్లాడలేదు అంటూ మీరు కామెంట్ చేయవచ్చు. మీరు విమర్శించవచ్చు. అవన్నీ మాకవసరం లేదు. కానీ, మాకు మేమే సూపర్ స్టార్లం.. అనడం ఎంతవరకు సబబు, అంటే మిగతావాళ్లు స్టార్స్ కాదా? మీకు మీరు స్టార్ అని చెప్పుకోండి పరవాలేదు. ఎవరినో హీరోలను చేయడం ఎందుకని మీరు ఎలా అంటారు… మీరేమీ ఎవరిని హీరోలను చేయడం లేదు. మీరెవర్ని హీరోలను చేస్తారు? జనాలు హీరోలను చేస్తారు. ” అంటూ తీవ్రంగా స్పందించాడు నాగబాబు.
3. టీవీ9 లో ‘అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు? చిరంజీవి ఏమయ్యాడు? మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు.’ అంటూ బాలయ్య వ్యాఖ్యలు
టీవీ9 లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వాళ్లు అందరూ సక్సెస్ కాలేదు అన్న సందర్భంలో మాట్లాడుతూ, “రాజకీయాల్లోకి వచ్చిన అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు? చిరంజీవి ఏమయ్యాడు? రాజకీయాలనేవీ అందరికీ సరిపోవు. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు కాబట్టి మాకు సరిపోయాయి” అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం సృష్టించాయి.
ఈ వ్యాఖ్యలపై నాగబాబు మాట్లాడుతూ, ” స్వర్గీయ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టారో.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా అంత పెద్ద స్టార్. ఇంచుమించు మీ తండ్రి వయసున్న వ్యక్తిని ఏం పీకారు అన్నపుడే చాలా బాధనిపించింది. చిరంజీవి ఏమయ్యాడు అన్నారు. మీ టాపిక్‌లో మా పేరు అవసరమా? మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు.. అని మిగితా వారిని తక్కువ చేసి మాట్లాడితే అందరూ ఊరుకోవాలా? మీరూ మాలాగే మనుషులు, మీరు కూడా ఒక తల్లిదండ్రులకే పుట్టారు.. మీరేమీ దైవాంశ సంభూతులు కాదు” అంటూ తీవ్ర పదజాలంతో నాగబాబు విమర్శించారు.
4. ఎన్ టివి లో చిరంజీవిని ఉద్దేశించి, “నేనెవరిని నెత్తికి ఎక్కించు కోను, నా పద్ధతిలో డిక్టేటర్ లా వెళ్తా” అంటూ వ్యాఖ్యలు
లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ఎన్ టివి లో ఒక రిపోర్టర్ చిరంజీవి గారిని కూడా ఉత్సవాలకు పిలుస్తున్నారా అని హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ ని అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ” నేనెవరిని నెత్తికి ఎక్కించు కోను, ఇది నా కష్టార్జితం. ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తా. నా పద్ధతిలో డిక్టేటర్ లా వెళ్తా” అని సమాధానమిచ్చారు.
దీని పై నాగబాబు స్పందిస్తూ, చిరంజీవిని పిలిచారా అని రిపోర్టర్ అడిగినప్పుడు పిలవలేదు అని చెబితే సరిపోయేది. ఎవరిని పిలవాలో పిలవకూడదో ఆ హక్కు మీకుంది. కానీ నేనెవరిని నెత్తికి ఎక్కించు కోను అని ఎందుకు అనాల్సి వచ్చింది. చిరంజీవి గారేమైనా మీకు ఫోన్ చేసి నెత్తికి ఎక్కించుకోమని అడిగారా? డిక్టేటర్ లాగా ప్రవర్తిస్తారని చెబుతున్నారు, సరే మీ ఇష్టం ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఇలా చెబుతున్నారు, అదే హిందూపురంలో మళ్ళీ పోటీ చేయండి చూద్దాం. మీరు ఎన్ని మాటలు అన్నా మేము సహిస్తూ స్పందించకుండా వేచి చూస్తున్నాం. కానీ మీరు మీ నోటిని కంట్రోల్ లో పెట్టుకోవడం లేదు” అని విమర్శించారు నాగబాబు.
5. ఆంధ్రజ్యోతిలో, అలగా బలగా పార్టీలు, సంకర జాతి పార్టీలు పుట్టుకొచ్చాయి అంటూ జనసేన పై పరోక్ష వ్యాఖ్యలు
” తండ్రి మతాచార్యుడు తనయుడు ఆచార్యుడు తల్లి రామానుజ మతస్థురాలు, అల్లుడు పింజారి, మరదలు మార్వాడి , ఒక తల లేదు ఒక తొండం లేదు, అలగా బలగా జనాలని వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలను ఇప్పుడు చూస్తున్నాం మనం. అలగా బలగా పార్టీలు, సంకర జాతి పార్టీలు పుట్టుకొచ్చాయి” – ఇది నందమూరి బాలకృష్ణ ఒక సభలో చేసిన వ్యాఖ్యలు. అయితే జనసేన పార్టీని పరోక్షంగా ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అప్పట్లో చాలామంది భావించారు.
ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ, “మీరు వైయస్ఆర్సిపి పార్టీని నేరుగా పార్టీ పేరు పెట్టి విమర్శించారు. కానీ అలగా బలగా జనాలను వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలు అంటూ పరోక్షంగా జనసేన ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మీరు అల్లుడు పింజారీ.. మరదలు మారాఠీ.. అంటూ ఏదో సామెత చెప్పారు గానీ నాకు అర్థం కాలేదు. మీ వ్యాఖ్యలు చూస్తుంటే, ఇతర కులాల మీద, జాతుల మీద మీకు గౌరవం లేదు అని అర్థమవుతుంది. ఎటాకారముంది మీకు. ఏంటి అంత ఎటకారం. మీకు మా తమ్ముడు పవన్ కల్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడాడు. అలా మాట్లాడినందుకు మా తమ్ముడ్ని రాజకీయంగా ఎదుర్కోండి.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు విమర్శించాల్సింది పార్టీ పాలసీలను కానీ.. అలగ బలగా జనం, సంకర జాతీ పార్టీలు అంటున్నారు.. అంటే వీరంతా సంకర జాతి పార్టీలనేనా మీ ఉద్దేశం. జనసేనలో తిరిగే వ్యక్తులు ఎస్సీ, ఎస్టీలు, బ్యాక్వర్డ్, రెడ్డీస్, కులాలు, బ్రాహ్మణులు, క్షత్రీయులు, కమ్మ, కాపు వారు, వైశ్యులు ఇన్ని కులాలు కలిసి పనిచేస్తున్నాయి. ఏ పార్టీలో అయినా ఇవే కమ్యూనిటీస్ ఉంటాయి. మీరు మాట్లాడిన మాటలకు వారి మనోభావాలు దెబ్బతినవా.!?.” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు నాగబాబు.
6. చిరంజీవి ఎన్టీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు
ఇది 2012 లో జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశాక ఒక సందర్భంలో చిరంజీవి రాజకీయ ప్రస్థానం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ, చిరంజీవి ఎన్టీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు అంటూ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో చిరంజీవి కూడా ఈ వ్యాఖ్యలపై హుందాగా స్పందించారు. బాలకృష్ణ తనకు మంచి స్నేహితుడని, తనది చిన్న పిల్లాడి మనస్తత్వం అని, చిన్న పిల్లలు మాట్లాడే మాటలకు పెద్దగా అర్థాలు ఉండవని, ఆ లెక్కన బాలకృష్ణ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
నాగబాబు వీడియోలో మరింతగా వివరించలేదు కానీ, అప్పటి వాద ప్రతివాదాలు చాలామందికి గుర్తున్నాయి. చిరంజీవి హుందాగా స్పందించాక కూడా బాలకృష్ణ చిరంజీవి స్పందనపై కూడా విరుచుకుపడుతూ ప్రతిస్పందించారు. ఎవడో నన్ను చిన్న పిల్లాడు అన్నాడు, వాళ్లు నా ఒక వైపు మాత్రమే చూశారు ( సింహ సినిమా డైలాగ్) అంటూ పరోక్షంగా మరొక సభలో వ్యాఖ్యానించాడు. అయితే ఆ వ్యాఖ్యలపై చిరంజీవి మళ్లీ స్పందించకుండా అక్కడితో వదిలేశారు. కానీ అప్పటి వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ ‘తన ఒక వైపు మాత్రమే అందరూ చూశారని అంటున్నాడని, ఆయన వెంటనే తన విగ్గు తీసేసి తన రెండో వైపు ఎలా ఉంటుందో ఆంధ్ర ప్రజలకు చూపించాలని’ వెటకారంగా స్పందించారు.
అయితే ఇప్పుడు నాగబాబు ఈ అంశంపై స్పందించారు. “మీ తండ్రి మీకు గొప్ప కావచ్చు. ఎవరి కుటుంబసభ్యులు వాళ్ళకు గొప్ప. ఒక రిక్షా వాడు కూడా తన కొడుకు కి గొప్పగా కనిపిస్తాడు. ఎన్టీఆర్ కాలి గోటికి చిరంజీవి సరిపోదు అని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు. బాలకృష్ణ చిరంజీవి కాలి గోటికి సరిపోరు అని మేము అంటే మీకు ఎలా ఉంటుంది. అంత అహంకారం ఏంటి అసలు. మీరు మా తమ్ముని రాజకీయంగా విమర్శిస్తే మాకు అభ్యంతరం లేదు కానీ ఇలా అహంకారపూరితమైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించం. భవిష్యత్తులో ఇలాంటి నోటి దురుసు వ్యాఖ్యలు చేయరని ఆశిస్తూ ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.” అంటూ వ్యాఖ్యానించారు నాగబాబు
మొత్తానికి నాగబాబు తను చెప్పదలుచుకున్నది చెప్పేశాడు. ప్రస్తుతానికైతే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. స్పందించమని అడిగినప్పటికీ నో కామెంట్స్ అంటూ తప్పుకున్నాడు. నాగబాబు వైపు నుంచి ఈ వివాదాన్ని ముగిస్తున్నాం అని చెప్పాడు కాబట్టి, మళ్లీ బాలకృష్ణ స్పందిస్తే తప్ప ఈ వివాదం మళ్లీ మొదలయ్యే అవకాశం లేదు. ఇప్పటికైతే ఈ కథ ముగిసినట్టే అనుకోవచ్చు
– జురాన్