భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప మరో రాష్ట్రంలో బేస్ లేదు. పైగా.. తమకు ఓట్లు లేవన్న కారణంగా మోదీ.. దక్షిణాది రాష్ట్రాల పట్ల అత్యంత దారుణమైన వివక్ష చూపారు. ఏపీ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత రేపేందుకు ప్రయత్నించారు. జయలలిత మరణం తర్వాతక తమిళనాడును ఫుట్ బాల్ ఆడుకున్నారు. తమకు టీడీపీ కటీఫ్ చెప్పిందన్న కారణంతో.. ఏపీలో బీజేపీ రేపిన అలజడి అంతా ఇంతా కాదు. కేరళలో శబరిమల ఇష్యూతో నిప్పు పెట్టారు. వరదలొస్తే ఆదుకోవడానికి చేతులు రాలేదు. దాంతో… ఆయా రాష్ట్రాల్లో మోదీపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లు సాధించింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ -జేడీఎస్ లు కలసి పోటీ చేస్తున్నాయి. కొద్ది రోజులకిందట జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్ కలసి పోటీ చేయడం వల్ల బీజేపీ ఘోరపరాజయం పాలయింది. ఓట్ల తేడా కూడా..లక్షల్లో తేలింది. దాంతో ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ సింగిల్ డిజిట్ కూడా దాటుతుందని..రాజకీయవర్గాలు అంచనా వేయడం లేదు. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వల్ల ఒక్క సీటు వచ్చింది. ఈ సారి అది కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఏపీలో డిపాజిట్లు కూడా రావు. తమిళనాడులో సీటే లేదు. అన్నాడీఎంకే పొత్తు పెట్టుకున్నా.. ఒక్క సీటు కూడా వస్తుందని బీజేపీ నేతలే నమ్మలేకపోతున్నారు. కేరళలో కూడా అంతే. శబరిమల ఇష్యూతో.. అలజడి రేపి..భావోద్వేగాలు రెచ్చగొట్టినా… ఓట్లు కొన్ని పెరుగుతాయంటున్నారు కానీ.. సీట్లు వచ్చేంత పరిస్థితి లేదు. అంటే.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో ఉన్న 101 సీట్లలో బీజేపీకి ఒకటి, రెండు మాత్రమే వస్తాయి.
దక్షిణాదిలో.. మిత్రులు, రహస్య మిత్రులు ఇద్దరూ బీజేపీకి ఉన్నారు. తమిళనాడులో.. అన్నాడీఎంకేను బెదిరించి పొత్తులు పెట్టుకోగలిగారు. ఐదు సీట్లు తీసుకోగలిగారు. ఇలా చేయడం వల్ల అన్నాడీఎంకేకు ఏమైనా అవకాశాలు ఉంటే.. వాటినీ నిర్వీర్యం చేశారు. బీజేపీకి కూడా చాన్స్ లేనట్లే. ఇక ఏపీలో రహస్య మిత్రపక్షంగా వైసీపీ ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ ఉంది. ఈ రెండు పార్టీలు గెలిచే సీట్లన్నీ… తమకే అండగా ఉంటాయని.. బీజేపీ నమ్ముతోంది. అందుకే… ప్రచారం కూడా.. ఆయాపార్టీలకు ఉపయోగపడేలానే చేశారు. తాము గెలవడానికి అన్నట్లుగా చేయలేదు. కానీ వారు ఎన్ని సీట్లు సాధిస్తారోనన్నదానిపైనే క్లారిటీ లేదు. బీజేపీకి మద్దతిస్తారన్న ఉద్దేశంతోనే.. ఆయా పార్టీలకు ప్రజలు దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం దక్షిణాదిలో బీజేపీకి.. సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయి. అంటే పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది.