పోలవరం ప్రాజెక్టు విషయమై రాజకీయ వర్గాల్లో వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పదవీ విరమణ చేయబోతున్న జలవనరుల శాఖ కార్యదర్శి రాసిన లేఖపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. కేంద్రం వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే పోలవరం నిర్మాణాన్ని కేంద్రానికే అప్పగించేస్తానని కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో భాజపా, టీడీపీ మధ్య ఉన్న పొత్తు తెగతెంపుల దశకు చేరుకుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఈవారం కొత్త పలుకులో విశ్లేషణ చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా భాజపా, టీడీపీల మధ్య పొత్తు కొనసాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేదంటే, పరిస్థితి వేరేలా ఉంటుందనీ, ఇతర రాష్ట్రాల్లో నత్తనడకన సాగుతున్న కొన్ని జాతీయ ప్రాజెక్టుల పరిస్థితినీ ఉదహరించారు. ఏపీ ముఖ్యమంత్రికీ ప్రధాని నరేంద్ర మోడీకీ దూరం పెరిగిందనే చర్చ బయట జరుగుతోందనీ, చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదనే అభిప్రాయాన్నీ వ్యక్తం చేశారు.
ఒకవేళ ఈ ప్రాజెక్టును అనుకున్న సమయంలో పూర్తి చేయకపోతే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా వచ్చే ఇబ్బందేం ఉండదని విశ్లేషించారు! పోలవరం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలూ కష్టపడుతుండటాన్ని ప్రజలు చూస్తున్నారనీ, సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు ఆయన పడుతున్న తపన ప్రజలకు తెలుసు అని రాశారు. కాబట్టి, ఒకవేళ పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తి కాకపోతే… దానికి కారణం కేంద్రంలోని భాజపా తీరే అని ప్రజలు ఆగ్రహించే అవకాశం ఉందట! ప్రాజెక్టు పూర్తి చేయకపోతే భాజపాపైనే ఏపీలో వ్యతిరేకత ఎక్కువౌతుందని విశ్లేషించడం విశేషం.
ఏపీ ప్రజల్లో భాజపాపై ఆగ్రహం పెరిగితే, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు సహజంగానే జంకుతారట! ఇదే పరిస్థితి వస్తే వైకాపా అధినేత జగన్ కూడా భాజపాతో పొత్తు కోసం ప్రయత్నించరని కూడా జోస్యం చెప్పారు. ఎందుకంటే, ప్రజా వ్యతిరేకతకు గురౌతున్న పార్టీతో ఎవరు మాత్రం పొత్తు పెట్టుకునేందుకు ముందుకొస్తారనేది వారి విశ్లేషణ. ఇక్కడే ఆంధ్రజ్యోతి అప్రమత్తతను గమనించాలి.
ఏతావాతా ఆ మీడియా మనోగతం ఏంటంటే… భాజపా పొత్తు అంటే ఉంటే అది టీడీపీతోనే ఉండాలి. పోలవరం విషయంలో ఇప్పటికే చంద్రబాబు ప్రయత్నం టీడీపీ మైలేజ్ కి సరిపోతుందన్నమాట. అంటే, పోలవరం సకాలంలో పూర్తి చేయకపోతే నష్టపోయేది భాజపా మాత్రమే అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో… భాజపా పొత్తులు ఎవరితో ఉండాలీ, ఎవరితో ఉండకూడదన్న దిశానిర్దేశం కూడా చేసేశారు! సో.. ఆంధ్రజ్యోతి విశ్లేషణ ప్రకారం.. ఏపీలో వ్యతిరేకత పెంచుకుండా ఉండాలంటే, భాజపా సర్కారు వెంటనే పోలవరం పూర్తి చేయాలన్నమాట. తెలుగుదేశం పార్టీతో పొత్తు నిలబెట్టుకోవాలన్నా కూడా పోలవరం వారు పూర్తి చేయాల్సిందే!