ఆరేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ లో భాగం అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాయింట్ ప్రెస్ స్టేట్ మెంట్ రూపంలో ఈ ప్రకటన విడుదల చేశారు. పదేళ్లుగా దేశ అభివృద్ధికి విస్తృత కృషి చేస్తున్న ప్రధాని మోదీ నేతృత్వంలో కలిసి పని చేందుకు టీడీపీ, జనేసన ముందుకు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను తీర్చేలా మోదీతో కలిసి టీడీపీ, జనసేన కృషి చేస్తాయన్నారు.
టీడీపీ , బీజేపీ మధ్య గతంలోనూ మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. 1996లోనే టీడీపీ ఎన్డీఏలో చేరిందన్నరు. వాజ్ పేయి.. నరేంద్రమోడీ నాయకత్వాల్లోని ప్రభుత్వాల్లో టీడీపీ భాగమయిందన్నారు. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయన్నారు. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు తెలిపిందన్నారు. . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని, దేశాభివృద్ధిని, ఏపీ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తు కుదుర్చుకున్నామని… సీట్ల అంశంపై ఒకటి రెండు రోజులలో ప్రకటిస్తామని తెలుగుదేశం పార్టీ కూడా అదే స్టేట్మెంట్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.
సీట్ల షేరింగ్‌పై ప్రకటనలు క్లారిటీ ఇవ్వనప్పటికీ జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ, ఎనిమిది పార్లమెంట్ సీట్లను కేటాయించారని చెబుతున్నారు. ఇందులో ఆరు బీజేపీ పోటీ చేస్తుంది. రెండింటిలో జనసేన పోటీ చేస్తుంది. జనసేన రెండు స్థానాలు కాకినాడ, మచిలీపట్నంగా ఖరారయ్యాయి. అనకాపల్లి కూడా జనసేనకే రావాల్సి ఉన్నా.. బీజేపీ ఒత్తిడితో ఆ పార్టీకి కేటాయించారు. రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక అసెంబ్లీ స్థానాల్లోనూ లెక్క కుదిరింది. బీజేపీ, జనసేనకు కలిసి 30 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో ఇరవై నాలుగు జనసేన, ఆరు బీజేపీ స్థానాల్లో పోటీ చేస్తుంది.