కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు అరకొర నిధులే దక్కాయి. విభజన తరువాత రెండు రాష్ట్రాలనూ ఆదుకుంటామని చెబుతూ వచ్చిన భాజపా మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలాయి. ఏపీ సర్కారు కొంత ఆగ్రహంగానే ఉంది. పోలవరం, రాజధాని నిర్మాణం, రైల్వేజోన్… ఇలా చెబుతూ పోతే ఒక్కటంటే ఒక్క హామీపై కూడా కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రాకు ప్రాధాన్యత దక్కలేదు. దీంతో మిత్రపక్షమైన భాజపాపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇంకోపక్క, తెలంగాణకు కూడా ఆశించిన స్థాయిలో కేటాయింపులు దక్కలేదు. విభజన తరువాత తెలంగాణకి ఉన్న అవసరాలు కేంద్రానికి వినిపించలేదు. ఈ తరుణంలో భాజపా తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు కొంత అసంతృప్తితో ఉన్నా… చంద్రబాబు నాయుడు మాదిరిగా ఆయన వ్యక్తం చేయడం లేదు. నిజానికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఒకటి కావాల్సిన సమయం ఇది. రాష్ట్ర అవసరాలతోపాటు రాజకీయ అవసరాలపరంగా చూసుకున్నా భాజపా మెడలు వంచగలిగేది ఇద్దరు చంద్రుల ఐక్యతే అనడంలో సందేహం లేదు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రాకు చాలా ప్రాధాన్యత ఉండేది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో 42 లోక్ సభ స్థానాలు ఉండేవి. ప్రాంతీయ పార్టీల సత్తా ఏ స్థాయిలో ఉంటుందనేది టీడీపీ చూపింది. 1999లో వాజ్ పేయి సర్కారును నిలబెట్టిందీ, నేషనల్ ఫ్రెంట్ కి జీవనాడిగా నిలిచిందీ తెలుగుదేశం పార్టీనే. జాతీయ పార్టీలకు ప్రత్నామ్నాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఎంతటి శక్తిమంతమైన పాత్ర పోషించగలదో అని చాటిచెప్పిన నాటి పరిస్థితులు భాజపాకి అనుభవైకమే. ఓరకంగా అలాంటి రాజకీయ అవసరాలు కూడా ఆంధ్రాను విభజించేందుకు ప్రేరేపితం చేసిన ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం లేని మెజారిటీ భాజపాకి గత ఎన్నికల్లో దక్కింది. దీంతో మోడీ సర్కారు దశలవారీగా ప్రాంతీయ పార్టీల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే చర్యలు చేపడుతూనే ఉంది. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తుకు ఉండదనీ, ఎప్పటికైనా జాతీయ పార్టీలతో కలవక తప్పదంటూ భాజపా అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడిన సందర్భాలూ ఉన్నాయి. మోడీ సర్కారు అప్రకటిత మిషన్ ఇది.
తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో భాజపా రాజకీయ లక్ష్య సాధనే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రణాళికా సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం లాంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి… రాష్ట్రాలన్నీ కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన ఒక అవసరాన్ని సృష్టిస్తున్నారు! ఫలితమే తెలుగు రాష్ట్రాలకు ఈ అరకొర కేటాయింపులు. ఆంధ్రా తెలంగాణలను లోక్ సభ సీట్ల సంఖ్యాపరంగా రెండు చిన్న రాష్ట్రాలుగానే భాజపా చూస్తున్న పరిస్థితి. ఈ నిర్లక్ష్య వైఖరిని సమర్థంగా ఎదుర్కోవాలంటే తెలుగు రాష్ట్రాలు ఐక్యతను ఢిల్లీకి వినిపించేలా చాటి చెప్పాలి. విభజన చట్ట ప్రకారం రెండు రాష్ట్రాలకూ దక్కాల్సిన కేంద్ర ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఉభయులకూ న్యాయం జరగాలంటే కేసీఆర్, చంద్రబాబు కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తే.. కచ్చితంగా భాజపా స్పందించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
తెలంగాణలో కేసీఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ.. ఇలాంటి కార్యక్రమాల గురించి కేంద్రం పట్టించుకోలేదు. ఇక, ఆంధ్రా విషయమైతే చెప్పాల్సిన పనేలేదు. అరకొర నిధులతో నత్త నడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు తప్ప, విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా భాజపా పరిగణనలోకి తీసుకున్న పరిస్థితి లేదు. రెండు రాష్ట్రాలకూ నిధులే సమస్య. కాబట్టి, ఇద్దరూ ఒకటై పోరాడితే, ప్రాంతీయ పార్టీల శక్తి సామర్థ్యాలు ఏపాటివో అనుభవం ఉన్న భాజపాలో కొంత కదిలక వస్తుందని చెప్పొచ్చు. ఈ దిశగా ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆలోచించాల్సిన సమయం ఇది.