ఐపీఎల్ సీజన్ 18 మొదలైంది. అప్పుడే 13 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌లలో ఆటగాళ్ల ఆట తీరుని గమనిస్తే టీంమిండియా సీనియర్ల ఆట తీరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోని ఆటతీరు పై విమర్శలు వస్తున్నాయి.
ధోని టీమిండియా కి ఎప్పుడో రిటైర్మెంట్ ఇచ్చేసాడు. కానీ సీఎస్కే జట్టు ధోనిని అంటిపెట్టుకుంది. ధోని ఐపిఎల్ నుంచి కూడా రిటైర్ అయిపోతాడని గత ఐదు సీజన్ నుంచి వినిపిస్తోంది. కానీ ఆయన రిటైర్ కావడం లేదు. నిజానికి ధోని అంటే అందరికీ ఇష్టం. కానీ ఇప్పుడు తను ఆడుతున్న తీరుపైనే ఎవరికి పెద్ద ఆసక్తి కనిపించడం లేదు. నాలుగో వికెట్ కి రావాల్సిన బ్యాట్స్ మెన్ తొమ్మిదో వికెట్ కు వస్తున్నాడు. ఇది నిజంగా ధోని ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయం. వికెట్లు వెనక ఏదో తన అనుభవం చూపిస్తున్నాడు కానీ ధోని నుంచి కోరుకునే ఆట ఇది కాదు. ఈ సీజన్‌ని గెలుపుతో ఆరంభించిన చెన్నై.. ఆ తరవాత వరుసగా రెండుసార్లు ఓటమిపాలైంది. ఈ ఓటములకు ముఖ్యంగా ధోనినే అభిమానులు నిందించారు.
రోహిత్ శర్మ విషయానికొస్తే పరిస్థితి మరోలా ఉంది. రోహిత్ గ్రేట్ టైమింగ్ ఉన్న బ్యాట్స్‌మెన్. అతని రికార్డులు, రన్స్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వన్డే క్రికెట్ గతిని మార్చిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఉంటాడు. టి20 వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలిపించాడు. అయితే ఐపీఎల్ కి వచ్చేసరికి డిఫరెంట్ సీన్ ఉంటుంది. ఐపీఎల్ అంతా ఫాస్ట్ గేమ్. చాలా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఆడాలి. ఆ బాడీ లాంగ్వేజ్ రోహిత్ శర్మ లో కనిపించడం లేదు. పైగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్నాడు. ఓ రెండు ఓవర్లు ఆడి పెవిలియన్ కి చేరిపోతున్నాడు. అసలు రోహిత్ శర్మ వికెట్ అంటే బౌలర్లకి కూడా లెక్క లేకుండా పోయింది. తను ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. అసలు రోహిత్ ప్రత్యర్థి జట్టు బలమైన సవాల్ గా గుర్తించడం లేదు.
విరాట్ కోహ్లీ ది మరో దారి. తను క్లాసిక్ క్లియర్. పరుగుల్ని సునాయాసంగా రాబడతాడు. కానీ విరాట్ ఆడుతున్న స్ట్రైక్ రేటు ఐపీఎల్ ఫార్మేట్ కి సరిపడదు. ఐపిఎల్ లో ఆట చాలా వేగం అందుకుంది. ట్రావిస్ హెడ్, సాల్ట్, రియల్ రికెల్టన్, క్లాసేన్, రస్సెల్.. ఈ ప్లేయర్లు ప్రతి మ్యాచ్ ఆడకపోవచ్చు. పరుగులు రాబట్టకపోవచ్చు. కానీ వాళ్లు ఆడితే మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తారు. అలా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే ఇన్నింగ్ ఇప్పుడు విరాట్ కోహ్లీ నుంచి రావడం లేదు. ఐపిఎల్ లో 18 సీజన్లు ఒకే జట్టుకి ఆడాడు. ఒక్కసారి టైటిల్ రాకపోవడం ఆయన ఫ్యాన్స్ కి కూడా బాధే.
నిజానికి రోహిత్, విరాట్, ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ అని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయిపోయారు. వీళ్లంతా కూడా టీమిండియా కి చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చినటువంటి ఆటగాళ్లు. వాళ్లపై అభిమానులకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. అయితే అంతే గౌరవంగా ఈ ఫార్మాట్ నుంచి స్వతహాగా తప్పుకుంటే హుందాగా ఉంటుందనే ఫీలింగ్ అభిమానుల్లో వచ్చేసింది. ఈ ముగ్గురూ… ఈ సీజన్‌తో స్వస్తి చెప్పడానికి రెడీగా ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ధోనీ అయితే సీజన్ మధ్యలోంచే తొలగినా ఆశ్చర్యంలేదని తెలుస్తోంది. ధోనీ ఎప్పుడూ షాకింగ్ నిర్ణయాలే తీసుకొంటాడు. ఐపీఎల్ విషయంలోనూ అలానే షాక్ ఇస్తాడేమో అన్నది ఆసక్తికరం.