ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పదవీ గండం స్పష్టంగానే కనిపిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా మెజార్టీ నేతలు ఏకమయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి వంటి ఒకరిద్దరు నేతలు తప్ప అందరూ సోము వీర్రాజుతో దూరదూరంగా ఉంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. పార్టీ స్టాండ్‌ను కాదని . .. సోము సొంత నిర్ణయాలతో వెళ్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆయనను తప్పించడం ఖాయమని.. అది ఎప్పుడనేది కూడా ఖరారయిందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. జనసేన పార్టీతో బీజేపీకి ఎన్నికల పొత్తు ఉన్నా సోము వీర్రాజు వ్యవహారశైలి కారణంగా జనసేన దూర దూరంగా ఉంటోంది. వైసీపీని ఓడించడానికి.. ఓట్లు చీలకుండా చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన తర్వాత సోము వీర్రాజు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామన్నదానిపైనా ఆయన పరోక్ష విమర్శలు చేశారు. అదే సమయంలో జిల్లాల అధ్యక్షుల అభిప్రాయం అంటూ ఎవరూ అడగకపోయినా టీడీపీతో పొత్తు వద్దని తీర్మానాలు చేయించారు. ఇదంతా వైసీపీ కోసం ఆయన తాపత్రయమని.. తాను అధ్యక్ష పదవి నిర్వహిస్తున్న బీజేపీ కోసం కాదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే ఏర్పడింది.
పైగా సోము వీర్రాజు.. చాలా మంది నేతల్ని కోవర్టులుగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి వచ్చి చేరిన నేతల్ని టీడీపీ నేతలుగానే చూస్తున్నారు. దీంతో వారంతా సోముపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిలో మఖ్య నేతలు ఉండటంతో వారు హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఏ విధంగా చూసినా సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి అన్‌ఫిట్ అన్న అభిప్రాయం హైకమాండ్‌లో ఏర్పడింది . పొత్తుల విషయం హైకమాండ్ చూసుకుంటుందని తెలిసినా అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆయనపై హైకమాండ్‌లో ఎలాంటి పాజిటివ్ అభిప్రాయం లేకండా పోయింది. పొత్తుల బీజేపీ సంకేతాలు ఇవ్వాలనుకున్న సమయానికి సోము వీర్రాజుకు గుడ్ బై చెప్పేస్తారని తెలుస్తోంది. అది ఎప్పుడనేది… బీజేపీ హైకమండ్ ఖరారు చేసే అవకాశం ఉంది.