ఈరోజు ఉదయాన్నే ఏపీ ఎంపీలకు మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్ క్లాస్ తీసుకున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటుపరం కాకుండా కాపాడాలంటూ ఎంపీలను కోరారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది! కానీ.. ‘అంతకుమించి’ ఇంకొంత ఉంటే బాగుంటుందనేది ఇప్పుడు చాలామందిలో మొదలైన కోరిక..! ఒక్క డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అంశమే కాదు.. చాలా సమస్యల విషయంలో పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్న విధానం బాగానే ఉంటోంది. అధికార పార్టీ కేంద్రాన్ని అడగలేనివీ, ప్రతిపక్ష పార్టీ పట్టించుకోలేని సమస్యలపై పవన్ స్పందిస్తున్నారు. తన పరిధిలో ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆ స్పందనను దాటి, ఈ ప్రశ్నలను మించి మరో అడుగు ముందుకేయాల్సిన అవసరం ఇప్పుడుంది. మరో ఏడాదిలో జనసేనాని ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఆ దిశగా ఆంధ్రా తెలంగాణల్లో పార్టీ నిర్మాణం చేస్తున్నారు. కార్యాలయ భవనాలు కడుతున్నారు. ఇదే క్రమంలో తనను తాను మరింత ప్రభావంతమైన నాయకుడిగా నిర్మించుకోవాల్సిన అవసరం కొంత కనిపిస్తోంది..!
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అంశం కావొచ్చు, ప్రత్యేక హోదా విషయమే కావొచ్చు… ఏపీ ఎంపీలు పోరాడాలనే ఇప్పటికీ పవన్ చెబుతున్నారు. సరే.. వారు పోరాడలేరు అనేది ఎప్పుడో స్పష్టమైంది కదా! ‘నాతో రండి కలిసి పోరాడదాం’ అని పవన్ పిలిచినా వారు రాలేదు. ఇంకా చెప్పాలంటే.. ఎవ్వరూ అలా రాలేరు కూడా. రాజకీయంగా టీడీపీకి భాజపాతో ఉండాల్సిన అవసరాలు ఉంటాయి. అలానే, మిగతా పార్టీల వారికీ ప్రాధాన్యతలు ఉంటాయి. కాబట్టి, ఆ పోరాటమేదో పవన్ మొదలుపెట్టేయాలి. తెలంగాణ ఉద్యమాన్నే తీసుకుంటే… అందరూ తనతో కలిసి వచ్చేంత వరకూ కేసీఆర్ వేచి చూడలేదు. తాను నమ్మిన సిద్ధాంతంతో, తనను నమ్మి వచ్చిన కొద్దిమందితో ఉద్యమానికి శ్రీకారం చుట్టేశారు. ఆ తరువాత, అందరూ అతని వెంట నడవాల్సిన అనివార్యతను తీసుకొచ్చారు. అంతవరకూ ఎందుకు… తాజాగా గుజరాత్ ఎన్నికలే తీసుకుంటే, హార్థిక్ పటేల్ కూడా అంతే కదా! పటేళ్లను ఏకం చేసి.. ఒకదశలో ప్రధాని మోడీకే చెమటలు పట్టించారు. పవన్ ను కేసీఆర్ తోనో, హార్థిక్ పటేల్ తోనో పోల్చి చూడాలన్నది ఇక్కడ పాయింట్ కాదు. పోరాటం చేయాలనుకుంటే ఎవరో రావాలని ఎదురుచూడాల్సిన అవసరం లేదని చెప్పడం, ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని వేచి చూడటం వ్యర్థమని చెప్పడం.
ప్రత్యేక హోదా, రైల్వేజోన్, రాజధాని నిధులు.. ఇలా అన్నింటా ఆంధ్రా విషయంలో కేంద్రానిది సవతి తల్లి ప్రేమే. ఈ పరిస్థితిని ప్రశ్నించే దమ్మూ ధైర్యం ఏపీలోని అధికార ప్రతిపక్షాలకు లేవని అర్థమౌతూనే ఉంది. అలాంటప్పుడు, ఎంపీలు ప్రశ్నించాలనో, మరెవో కలిసి రావాలనో పవన్ ఎందుకు ఎదురుచూడాలి? ‘ప్రత్యేక హోదాపై ఎవ్వరూ స్పందించకపోతే నేనే బరిలోకి దిగుతా’ అని ఏడాది కిందట పవన్ హెచ్చరించారు. అప్పుడే ఆయన రంగంలోకి దిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. సరే, తనకు ఓర్పూ సహనం ఎక్కువ కాబట్టి ఇన్నాళ్లూ ఆగారనే అనుకుందాం. ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు! ఎవరో వస్తారనీ, ఏదో చేస్తారని వేచి చూడాల్సిన అవసరం పవన్ కి ఏముంది..? కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన నిధులూ కల్పించాల్సిన ప్రయోజనాలపై ప్రత్యక్ష పోరాటానికి పవన్ సిద్ధమైతే… జనసేనకు ఇంతకంటే బలమైన రాజకీయ పునాది మరొకటి ఉంటుందా..?
పవన్ కల్యాణ్ పై ఇప్పటికీ చాలామందికి చాలా ఆశలున్నాయి. కాబట్టి, ట్వీట్ల ద్వారా, లేదా ప్రెస్ మీట్ల ద్వారా జరిపే ఈ అజ్ఞాత రాజకీయవాసాన్ని ఇకకైనా వీడాలి. జనంలోకి రావాలి. జనం కోసం రావాలి. అప్పుడే జనం సైన్యమౌతారు. పోరాడితే పోయేదేం లేదు.. దాస్య స్రుంకలాలు తప్ప. ఇలాంటివి స్ఫూర్తి వాక్యాలు పవన్ చాలానే తెలుసు కదా.