జె ఎఫ్ సీ నివేదిక సందర్భంగా పవన్ కళ్యాణ్ తో పనిచేసిన మాజీ సీ ఎస్, ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణా రావు కి పవన్ కళ్యాణ్ తో లంకె బాగానే కుదిరినట్టుంది. అమరావతి రాజధాని పై ఆయన వ్రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా వస్తున్నాడని ప్రకటించారు ఐవైఆర్ కృష్ణారావు.ఏప్రిల్5న విజయవాడలో ఈ పుస్తకావిష్కరణ జరగనుందని వివరించారు ఐవైఆర్.
తను వ్రాసిన ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ,” సీఎస్‌గా పనిచేసినప్పుడు రాజధాని ఏర్పాటుపై నాకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. నవ్యాంధ్ర రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు, అమరావతి కోసం వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్, స్విస్ చాలెంజ్ విధానం తదితర అంశాలన్నింటినీ నా పుస్తకంలో ప్రస్తావించాను. ప్రపంచంలో, భారత్‌లో జరిగిన రాజధానుల నిర్మాణాలను పోల్చుతూ అకడమిక్ పద్ధతిలో చర్చచేశాను. దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భాల్లో ఛండీగఢ్, భువనేశ్వర్, రాయ్‌పూర్, రాంచీ లాంటి రాజధానులను ఏ ప్రాతిపదికన కట్టారు, అసలు ప్రపంచ వ్యాప్తంగా రాజధానుల నిర్మాణాల అనుభవాలేంటి? తదితర అంశాలను కూలంకుశంగా పరిశీలించి ఒక పుస్తకం రాశాను” అని వివరించారు ఐవైఆర్ కృష్ణారావు.
‘ఎవరి రాజధాని అమరావతి’ టైటిల్‌తో రానున్న పుస్తకాన్ని ఏప్రిల్ 5న పవన్ కల్యాణ్ విజయవాడలో ఆవిష్కరించనున్నారని తెలిపారు ఐవైఆర్.