మొత్తానికి ఐఎఎస్ అధికారి నుంచి బ్రాహ్మణుల నేతగా, అక్కడి నుంచి ఇప్పుడు రాజకీయ నేతగా ఐవైఆర్ కృష్ణారావు పరిపూర్ణంగా రూపాంతరం చెందుతున్నారు. చీఫ్ సెక్రటరీగా వున్నపుడు ఐవైఆర్ కృష్ణారావు స్వరం ఎక్కడా వినిపించేది కాదు. చాలా నెమ్మదిగా ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్లారు. అసలు ఆయన బ్రాహ్మిన్ అన్న సంగతే అతి కొద్దిమందికి తప్ప ఎవరికీ తెలియదు. విభజన ఆంధ్రలోనే ఆయన చీఫ్ సెక్రటరీగా వున్నారు. ఆయన వున్నపుడే అమరావతికి బీజాలు పడ్డాయి. ఆ జీవోలు అన్నీ ఆయనకు తెలిసే బయటకు వచ్చాయి. అంతే తప్ప, ఆయనపై నుంచి హైజంప్ చేసి కాదు.
రిటైర్ అయిన తరువాత బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ గా కొత్త అవతారం దాల్చారు. అప్పటి నుంచి ఐవైఆర్ గొంతు కాస్త వినిపించడం ప్రారంభమైంది. అప్పుడు కూడా కేవలం బ్రాహ్మణ సంఘాల్లో ప్రసంగాలకే పరిమితం అయిపోయింది. కానీ ఎప్పుడయితే ఐవైఆర్కె ను బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ గా తొలగించారో, అదిగో, అప్పుడు ప్రారంభమైంది కొత్త పరిణామక్రమం. పదవి నుంచి దింపిన తొలినాడు, మలినాడు కేవలం తనకు, బ్రాహ్మిన్ సంఘానికి సంబంధించిన వివరణలు తప్ప వేరు మాట్లాడలేదు. కానీ ఆ తరువాత నుంచి మెల్లగా పొలిటికల్ స్పీచ్ ల మాదిరిగా మాట్లాడడం ప్రారంభించారు.
ఆఖరికి ఇప్పుడు అమరావతి, స్విస్ కంపెనీలు, తప్పుడు ఒప్పందాలు, అనుమానాల వరకు వచ్చారు ఐవైఆర్కే. చీఫ్ సెక్రటరీగా వున్నపుడు ఆయన వీటన్నింటి గురించి తెలుసుకునే వుంటారు. మరి అప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడు మాట్లాడడాన్ని చూస్తే, జనం ఆయన చిత్త శుద్ధిని అనుమానిస్తారు. కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసమో, లేదా ఇతరత్రా ఉపయోగాల కోసమో అప్పుడు బాబు వెనుక మౌనంగా వుండి, ఇప్పుడు అవేవీ లేకపోయేసరికి గొంతు విప్పుతున్నారన్న అనుమానాలు కలుగుతాయి. పైగా ఐవైఆర్కే లాంటి వాళ్లు, తమ వ్యవహారం నేపథ్యంలో ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆరోపణలు చేసినా, అవి జనం పట్టించుకోరు. ఎందుకంటే వారికి విషయం, వివాదం తెలుసు కనుక.
మొత్తం మీద ఇదంతా చూస్తుంటే, ఐవైఆర్కేకే రాజకీయ రంగప్రవేశం చేసేసినట్లే కనిపిస్తోంది.