నాలుగేళ్ల నవ్యాంధ్రలో పని చేసిన ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు… పదవి కాలంలో నోరు మెదపలేదు. రిటైరైన తర్వాత చాలా కాలంగా కామ్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం వారు ఏం ఆశిస్తున్నారో కానీ… రాజకీయంగా… ప్రతిపక్ష నేత జగన్‌ను మించిపోయేలా… ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వారిలో ఒకరు ఐవైఆర్ కృష్ణారావు. ప్రభుత్వంపై పోరాడి.. పోరాడి అలసిపోయారేమో కానీ.. బీజేపీ పంచన చేరిపోయారు. ట్వీట్లు, పుస్తకాలతో … ప్రస్తుతానికి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీగా పని చేసి.. రిటైరైన మరో అధికారి కల్లం అజయ రెడ్డి మాత్రం ఫుల్ టైమ్.. పొలిటియన్గా మారిపోయారు. ఆయితే తాను ఏ పార్టీలో లేను అనే ముసుగు మాత్రం వేసుకున్నారు.
అజేయ కల్లంగా ప్రసిద్ధుడైన ఈయన చీఫ్ సెక్రటరీగా… పొడిగింపు రాలేదని… మనస్థాపానికి గురయ్యారని ప్రచారం జరిగింది. ఏ అధికారికైనా… చీఫ్ సెక్రటరీగా చేయాలనేది ఆకాంక్ష. అధికారవర్గానికి ఆయన ముఖ్యమంత్రిలాంటి వాళ్లు. నిర్ణయాలు సీఎం తీసుకున్నా.. ఆదేశాలు మాత్రం.. చీఫ్ సెక్రటరీ పేరు మీదే వస్తాయి. ఈయన కోరికను చంద్రబాబు తీర్చారు. కానీ.. పదవి ఇచ్చేటప్పటికి ఆయన సర్వీసు రెండు, మూడు నెలలు మాత్రమే ఉంది. కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు.. తనకు రెండేళ్లు పొడిగింపు తీసుకొస్తారని ఆశపడ్డారు. కానీ… చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదు. రిటైరవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా చంద్రబాబు ఏ పదవీ ఇవ్వలేదు. మరో వైపు తెలంగాణలో రిటైరైన ప్రతీ చీఫ్ సెక్రటరి, డీజీపీనీ కేసీఆర్ అదే స్థాయిలో ఏదో ఓ పదవి సృష్టించి కూర్చోబెడుతున్నారు. ఈ కారణంగా… తనను.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. అజేయకల్లాం ఫీలయ్యారు. ఈ అసంతృప్తిని వైసీపీ నేతలు క్యాచ్ చేసేశారన్న ప్రచారం జరుగుతోంది.
కొన్నాళ్లు ఐవైఆర్, అజేయ కల్లాం జంట కవులుగా తిరిగి.. చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు సాక్షి పత్రిక రాసిచ్చే ఆరోపణలను చదివేవారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అజయకల్లాం సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో.. జిల్లాల్లో మీడియా సమావేశాల్లాంటివి.. ఏర్పాటు చేస్తున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ.. సాక్షి పత్రిక మాత్రం.. బ్యానర్లు, బాటమ్ వార్తలుగా కవర్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఒక్కో రోజు జగన్మోహన్ రెడ్డికి కూడా కవరేజ్ ఉంటుందో లేదో కానీ.. ఈ అజేయ కల్లాంకు మాత్రం… కంపల్సరీ స్పేస్ ఉంటోంది. రోజూ సాక్షి చేసే ఆరోపణల్నే ఆయన వల్లె వేస్తూంటారు కాబట్టి.. అదే ప్రచురిస్తూ ఉంటారు. మొత్తానికి జగన్ చెబితే ప్రజలు నమ్మడం లేదని.. ఇలా మాజీ సీఎస్ హోదా ఉందని.. వీళ్లతో చెప్పించి… భారీగా ప్రచారం చేయిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. వారి ఆరోపణల్ని సాక్షి తన కవరేజీ ద్వారా నిరూపిస్తున్నట్లు అవుతోంది.