ఎవరైనా తను ఎలాంటి పనులు చేసినా తమను తాము సమర్థించుకుంటారు. తప్పు చేసినా… సరే తను చేసింది ఒప్పేనని చెప్పుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాత్రం.. తాను చేసినవి తప్పులేఅని నిరంతరాయంగా చెప్పుకోవాల్సి వస్తోంది. కానీ ఇక్కడ చిన్న మినహాయింపు ఆయన తనకు తాను ఇచ్చుకున్నారు. తను తప్పులని తేల్చిన ఆ పనులన్ని తన చేతుల మీదుగా జరిగినా… ఆ విషయాన్ని మాత్రం దాచి పెట్టి మిగతా విషయాన్ని చెబుతున్నారు. ఆ నిర్ణయాల్లో.. పనుల్లో తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు.తాజాగా పీడీ అకౌంట్ల విషయంలోనూ… సాక్షి పత్రికకు రాసిన వ్యాసంలో ఇలాంటి పాట్లే పడ్డారు.
చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతో ఇటీవలి కాలంలో ప్రతిపక్ష వైసీపీకి దగ్గరయిన ఐవైఆర్ కృష్ణారావు..సాక్షి పత్రిక,టీవీల్లో తరచూ కనిపిస్తున్నారు. సాక్షి ఎడిటోరియల్ పేజీలో క్రమం తప్పకుండా ఆర్టికల్స్ రాస్తున్నారు. ప్రస్తుతం పీడీ అకౌంట్ల వివాదంపైనా ఆయన ఓ ఆర్టికల్ రాశారు. దాంట్లో పీడీ అకౌంట్లు భారీ స్థాయిలో ఉండటం కరెక్ట్ కాదు అని తేల్చారు. ఉమ్మడి ఏపీలో 70వేల పీడీ అకౌంట్లు ఉన్నాయి. విభజన తర్వాత ఆపరేషన్ లో లేని అకౌంట్లతో కలిపి 50వేలకుపైగా ఎకౌంట్లు ఉన్నాయని లెక్క తేల్చారు. ఈ ఎకౌంట్లన్నింటిని ఎవరు పర్యవేక్షిస్తారు..? వీటిని ప్రారంభించినడానికి ఎవరు అంగీకరిస్తారు..? నిధుల విడుదలకు… సంతకం ఎవరు చేస్తారు..?. అన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కనుసన్నల్లోనే ఉంటాయి. ఆయనే అన్నింటిని రెగ్యులేట్ చేస్తారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు పని చేసిన సందర్భంలోనూ.. ఇన్ని పీడీ అకౌంట్లు ఉన్నాయి. కానీ ఇలా ఉండటం స్కామ్ అవుతుందని ఆయన ఎందుకు అప్పుడు గుర్తించలేకపోయారు. తన హయాంలో ప్రారంభమైన పీడీ అకౌంట్లపై ఏం సమాధానం చెబుతారు..?
కాగ్ పేరుతో ఐవైఆర్.. తన వ్యాసంలో అనేక ఆరోపణలు చేశారు కానీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వాటికి సంబంధించిన నిజాలను వెల్లడించడానికి ఆయన దగ్గర కావాల్సినంత సమాచారం ఉంటుంది. ఎందుకంటే.. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అధికార యంత్రాంగాన్ని నడిపించారు కాబట్టి. కానీ తనపై తాను ఆరోపణలు చేసుకుంటున్నట్లుగా కాకుండా… ప్రభుత్వంపై అనుమానాలు కల్పించడమే లక్ష్యమన్నట్లుగా వ్యాసం రాసుకొచ్చారు. కానీ ఆ పీడీ అకౌంట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన ఆధ్వర్యంలోనే నిర్వహించారని..చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు. అమరావతి విషయంలోనూ అంతే.. ఇప్పుడు పీడీ అకౌంట్ల విషయంలోనూ అంతే.