ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం తొలగింపుపై.. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు… నేరుగా కోర్టులో పిటిషన్ వేశారు. ఎల్వీని తొలగించినప్పుడే.. సోషల్ మీడియాలో.. సీఎంవో అధికారుల బాధ్యత లేని అధికారం అంటూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన తర్వాత.. పత్రికల్లో ఆర్టికల్స్ రాశారు. ఇప్పుడు.. ఇలా ఆకస్మిక బదిలీలు చేయడం సరి కాదంటూ.. కోర్టులో పిటిషన్ వేశారు. ఐవైఆర్.. ప్రస్తుతం ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్ అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థకు అధ్యక్షుని హోదాలో… హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీని ప్రకారం.. ” ప్రభుత్వ అధికారులకు కనీస పదవి కాల భద్రత” కల్పించాలని ఆయన కోరుతున్నారు.
ప్రభుత్వాలు అధికారులను ఇష్టానుసారంగా బదిలీ చేస్తూ.. వారి మనో స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని.. ఐవైఆర్ భావిస్తున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ చేసిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇకపై అధికారులకు కనీసం రెండేళ్లు పదవీకాల భద్రత కల్పించాలని ఐవైఆర్ న్యాయస్థానాన్ని కోరుతున్నారు. అధికార వ్యవస్థపై ఐవైఆర్కు ఇంత హఠాత్తుగా ఎందుకు కోపం వచ్చిందో.. చాలా మందికి అర్థం కావడం లేదు. ఎందుకంటే.. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అధికారుల బదిలీలు ఆయన చేతుల మీదుగానే జరిగాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు.. ఇలా ఎవరికైనా.. రెండేళ్లు పదవీకాల భద్రత ఇవ్వాలన్న సిఫార్సును ప్రభుత్వానికి చేయలేదు. కానీ ఇప్పుడు ఎల్వీని తొలగించే సరికి… ఐవైఆర్కి కోపం వచ్చింది. నేరుగా కోర్టులో సైతం పోరాటం ప్రారంభించారు.
ఐవైఆర్ కృష్ణారావు నిజానికి.. ఏపీ ప్రభుత్వ పెద్దలకు..నిన్నామొన్నటి వరకూ సన్నిహితుడే. చంద్రబాబుతో చెడిన తర్వాత ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. వైసీపీ హైకమాండ్ కు దగ్గరయ్యారు. సాక్షి మీడియాలో కావాల్సినంత స్పేస్ పొందారు. వైసీపీలో చేరుతారని అనుకున్నారు కానీ.. ఆయన బీజేపీని ఎంచుకున్నారు. నిన్నామొన్నటి వరకూ.. వైసీపీ సర్కార్ పై.. సానుకూలంగానే ఉన్నారు. హఠాత్తుగా వ్యతిరేక స్వరం ప్రారంభించారు. ఓ రకంగా న్యాయపోరాటం కూడా ప్రారంభించారు. ఇది ఏ మలుపు తిరుగుతుందో మరి..!