ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ చీఫ్ అమిత్ షాతో కండువా కప్పించుకున్నారు. అమిత్ షా వద్దకు.. ఐవైఆర్ కృష్ణారావును ఏపీ బీజేపీ చీఫ్ .. కన్నా లక్ష్మినారాయణ తీసుకెళ్లారు. గత వారం.. విశాఖ జగన్ బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. అందులో ప్రసంగించిన కృష్ణారావు చివరిలో.. తాను వైసీపీలో చేరడానికి రాలేదని ప్రకటించారు. సందర్భం లేకుండా చేసిన ఆ ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే.. ఆయన అధికారికంగా వైసీపీలో లేకపోయినా… వైసీపీ మనిషిగానే అందరూ చూస్తున్నారు మరి. అయితే.. తాను వైసీపీలో చేరడానికి రాలేదని చెప్పడమే కాదు.. వారంలోనే వెళ్లి బీజేపీలో చేరిపోయారు. ఇది జగన్‌కు షాకా..? లేక… మ్యూచువల్ అండర్ స్టాండింగా అనేది ముందు ముందు రాజకీయ పరిణామాల్ని బట్టి తెలుస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత కొంత మంది సీనియర్లు ఉన్నప్పటికి.. చంద్రబాబు ఐవైఆర్ కృష్ణరావును చీఫ్ సెక్రటరీగా ఎంచుకున్నారు. ఐవైఆర్ సమయంలోనే.. అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. స్విస్ చాలెంజ్ విధానాలో… రాజధానిని నిర్మించాలని నిర్ణయించారు. నవ్యాంధ్రలో అనేక కీలక నిర్ణయాలు.. ఐవైఆర్ చేతుల మీదుగానే జరిగాయి. పదవి విరమణ తర్వాత ఐవైఆర్ విజ్ఞప్తి మేరకు చంద్రబాబు రూ. 100 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. దానికి చైర్మన్‌గా నియమించారు. ఆ కార్పొరేషన్ పేద బ్రాహ్మణులకు ఎంత సాయం చేసిందో కానీ.. చైర్మన్‌గా ఉన్న ఐవైఆర్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ కార్పొరేషన్‌కు చైర్మన్‌గానే… ప్రభుత్వాన్ని, చంద్రబాబును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దాంతో.. చంద్రబాబు .. పదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి.. ఐవైఆర్ వైసీపీకి దగ్గరయ్యారు.
ప్రత్యేకంగా అమరావతిపై.. ఐవైఆర్ దృష్టి పెట్టారు. ఎవరి రాజధాని అమరావతి పేరుతో ఓ పుస్తకం ప్రచురించింది. స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు మీ హయాంలోనే కదా.. స్విస్ చాలెంజ్ పై.. నిర్ణయం తీసుకుంది.. అప్పుడు వ్యతిరేకించారా అని సూటిగాప్రశ్నించింది. కానీ గుర్తు లేదని.. చెప్పి తప్పించుకున్న ఐవైఆర్. ఆ తర్వాత కూడా… అంటే ఇప్పటికీ.. ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలోనూ విమర్శిస్తూ..సాక్షి పత్రికలో వ్యాసాలు రాస్తూనే ఉంటారు. చివరికి పీడీ అకౌంట్ల విషయంలోనూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎస్ గా పని చేసి ఉన్నందున పీడీ అకౌంట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అంశం ఆయనకు తెలుసు. లొసులుగు ఉంటే బయటపెట్టాలి. కానీ… బీజేపీ నేతలు చేసే విమర్శలు చేసి కథనం రాశారు. అలా ఇక వైసీపీలో చేరడమే మిగిలింది అనుకుంటున్న సమయంలో.. ఆయన హఠాత్తుగా బీజేపీ కండువా కప్పేసుకున్నారు. జాతీయ పార్టీగా.. మళ్లీ అధికారంలోకి వస్తే.. ఏదో ఓ పదవి ఇస్తుందన్న అంచనాతోనే… ఐవైఆర్ బీజేపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది.