వారం రోజులు ఆలస్యంగా తన పెన్షన్ వచ్చిందని… మూడు రోజులుగా ఐవైఆర్ కృష్ణారావు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఆయన రోజువారీగా… ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి జగన్కు సలహాలిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతిలోనే పాలనా రాజధానిగా ఉంచాలని విశాఖను వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేయాలని సలహాలిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వనరులు సమకూర్చగలిగే స్థాయి విశాఖకు ఉందని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. అలా చేస్తేనే.. రాష్ట్రం ఆర్థికంగా మెరుగ్గా ఉంటుందని సలహా ఇస్తున్నారు.
నెటిజన్లు అడిగారనో.. మరో కారణమో చెప్పుకుని.. తానే ఆర్థిక మంత్రి పొజిషన్లో ఉంటే ఏం చేస్తానో కూడా సలహాలిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతోనే సంక్షేమ పథకాలు కొనసాగించి.. అప్పులు తీసుకొచ్చి.. పెట్టుబడులు పెట్టి సంపద సృష్టిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అలా చేస్తేనే.. రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని లేకపోతే.. దివాలా అంచుకు చేరుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఆదాయానికి పొంతన లేని వ్యయాన్ని ప్రభుత్వం చేస్తోందని.. నాలుగు రోజులు ముందో వెనకో భంగపాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.
మరికొన్ని సలహాలను కూడా జగన్ సర్కార్కు ఐవైఆర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట్రం భాగం పంచుకోవాల్సిన వాటికి పూర్తిగా నిధులు కేటాయించాలని.. ఇలా చేస్తే మౌలికసదుపాయాల కల్పించవచ్చన్నారు. చైనా నుంచి ఇతర ప్రాంతాలకు తరలి పోతున్న పరిశ్రమను తెచ్చుకోవాలని.. దీని కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ వేయాలన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని వీలైనంత నిధులను రాబట్టాలని కూడా సూచించారు. జగన్మోహన్ రెడ్డికి సలహాలివ్వడానికి చాలా మంది ఉన్నారు. అయితే.. సలహాదారు పదవి ఇవ్వకపోయినప్పటికీ.. ఐవైఆర్ సలహాలిస్తున్నారు. వీటిని జగన్మోహన్ రెడ్డి కనీసం పరిగణనలోకి తీసుకునే అవకాశం కూడా లేదనేది ఆయనకు కూడా క్లారిటీ ఉంటుందని అంటున్నారు.