బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహార శైలి ఉంటోందన్న ఆరోపణల నేపథ్యంలో ఐవైఆర్ ను కార్పొరేషన్ పదవి నుంచి సర్కారు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీపై చాలా విమర్శలు చేశారు. త్వరలోనే ఓ పుస్తకం రాస్తాననీ, రాజధాని అమరావతితోపాటు మరికొన్ని కీలకాంశాలను ప్రజల ముందుకు ఉంచుతానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఐవైఆర్ పై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై తాజాగా ఐవైఆర్ స్పందించారు.
గట్టిగా అడిగేవారు లేకపోబట్టే బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు దక్కడం లేదని ఆయన ఆరోపించారు. కాపుల తరఫున ముద్రగడ పద్మనాభం బలంగా నిలుస్తూ పట్టుబట్టకపోయి ఉంటే కాపు కార్పొరేషన్ కు పెద్ద మొత్తంలో నిధులు రావని అన్నారు. రాయపాటి చేసిన ఆరోపణ గురించి మాట్లాడుతూ… తనకు దొనకొండలో భూములు ఉన్నాయంటూ ఆరోపించారనీ, దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని తాను అనుకున్నాననీ, అయితే.. ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి గౌరవ పార్లమెంటు సభ్యుడు కావడంతో మాట్లాడాల్సి వస్తోందన్నారు. అలాంటి నాయకుడు చేసిన ఆరోపణలపై స్పందించకపోతే ఒప్పుకున్నట్టు అవుతుందన్నారు. ఈ సందర్భంగా తాను ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నదేంటంటే… ఒక పార్లమెంట్ సభ్యుడు చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని కృష్ణారావు కోరారు. ఆయన చేసిన ఆరోపణల్లో నిజముంటే వెంటనే తనపై చర్యలు తీసుకోవాలన్నారు. రాయపాటి చేసిన ఆరోపణల్లో నిజం లేకపోతే.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ముఖ్యమంత్రి విజ్ఞతకే వదిలేస్తానని అన్నారు. దొనకొండ మాత్రమే కాదు.. ప్రకాశం జిల్లాలోనే తనకు ఎక్కడా ఎలాంటి భూములు లేవని, కావాలంటే చెక్ చేసుకోవచ్చని ఐవైఆర్ స్పష్టం చేశారు.
మరి, రాయపాటి ఆరోపణలపై ఐవైఆర్ ఇచ్చిన కౌంటర్ కు అధికార పార్టీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఆయన కోరుతున్నట్టు రాయపాటి ఆరోపణలపై విచారణ లాంటి చర్యలు ఉంటాయా అనంటే… అనుమానామే. ఎందుకంటే, ఐవైఆర్ తొలగింపు ఇష్యూని వీలైనంత త్వరగానే ఫేడ్ అవుట్ చేయాలనే టీడీపీకి ఉంటుంది కదా! కానీ, ఎలాగూ ఈ ఇష్యూపై రాయపాటే స్పందిచారు కాబట్టి.. మరోసారి ఆయనే మీడియా ముందుకు వస్తారేమో చూడాలి.