ఒకటో తేదీ ఆదివారం అయినప్పటికీ .. ఏపీ సర్కార్ సామాజిక పెన్షన్లను.. మద్యాహ్నం లోపు దాదాపుగా 90 శాతం పంపిణీ చేసింది. ప్రతీ సారి.. గ్రామాల్లో ఓ చోటకు లబ్దిదారులందర్నీ పిలిపించి.. అక్కడ అందచేసేవారు. ఈ సారి మాత్రం.. వాలంటీర్లు లబ్దిదారుల ఇళ్లకే వెళ్లి ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల లబ్దిదారులకు అదనంగా రూపాయి లాభం లేదు కానీ.. ఇంటికే తెచ్చి ఇచ్చారన్న ఓ అభిప్రాయం మాత్రం వారి మనసులో పడుతుంది. ఇదే ఇమేజ్ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే.. ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదంటూ… మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఒక్క సారిగా ఆ అంశంపై చర్చ ప్రారంభమయింది.
ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయాన్ని.. టీడీపీ నేతలు విస్తృతంగా షేర్ చేశారు. దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొంత మంది.. అలా ఇవ్వడం మంచిదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. మరికొంత మంది.. ఐవైఆర్ అభిప్రాయం కరెక్టేనన్ననారు. సాంకేతిక అభివృద్ధి చెంది.. క్షణాల్లో.. డబ్బులు.. ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న ఈ రోజుల్లో ఇంటికెళ్లి మరీ డబ్బులివ్వడం ఏమిటని.. దాని కోసం..మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టడం ఏమిటన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అదే సమయంలో.. సామాజిక పెన్షన్లు ఇస్తోంది వృద్ధులు, నిస్సహాయులకేనని.. వారికి ఇంటికి వెళ్లి ఇస్తే తప్పేమిటన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.
పెన్షన్లను ఇంటికి వెళ్లి ఇవ్వడానికి రూ. 1600 కోట్లు ఖర్చు చేశారని.. గత పద్దతిలోనే ఇచ్చి ఉంటే.. మరికొన్ని లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చి ఉడేవారని టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఈ నెలలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న ప్రభుత్వం.. చాలా వ్యూహాత్మకంగా జబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. తీరిగ్గా ఓటు వేసే వృద్ధుల అభిమానాన్ని పొందడానికి శాయశక్తులా ప్రయత్నించింది. దానికి వాలంటీర్లు సహకరించారు. ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేసే కోణం వేరు.. ఇతర పక్షాలు చూస్తున్న కోణం వేరు. ఈ పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేసే విషయంలో ఎవరి కోణంలో వారి వాదన కరెక్టే.. !