సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తొలి సారి ఓ ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతున్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీకి వ్యతిరేకంగా. పుదుచ్చేరికి చెందిన యానాం ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావుతో కలిసి ఓ పోరాట కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాకినాడలో ప్రసిద్ది చెందిన ఎంఎస్ఎన్ నాయకర్ చారిటీస్ విద్యాసంస్థలు ఉన్నాయి. ఆ సంస్థకు చెందిన భూములు ప్రస్తుతం.. ఎంపీ తోట నరసింహం కుటుంబీకులు అనుభవిస్తున్నారని… అతి తక్కువ లీజు కడుతున్నారని వీరు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా.. ఈ భూములను… శాశ్వతంగా కైవసం చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారన్న చెబుతున్నారు.
మల్లాడి సత్యలింగం నాయకర్ అనే దాత.. 1915లో తన పేరుతో ఎంఎస్ఎస్ చారిటీస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎలిమెంటరీ స్కూళ్ల దగ్గర్నుంచి డిగ్రీల కాలేజీ వరకూ అనేక విద్యాసంస్థల నడుస్తున్నాయి. ఈ సంస్థకు భూముల లీజుల ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన వనరు. ఇలా పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం కుటుంబం కూడా 284 ఎకరాల చారిటీ భూములను లీజుకు తీసుకుంది. కేవరం ఎకరాకు కేవలం రూ. 16 చెల్లిస్తూ అనుభవిస్తున్నారంటూ పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ఈ భూములను రక్షించడానికి మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీ భూముల పరిరక్షణ సమితి పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు.
విద్యార్థులకోసం నాయకర్ భూములను దానం చేస్తే శాశ్వతంగా ఆక్రమించుకోవాలని ఎంపీ తోట నరసింహం కుటుంబం చూస్తోందని పుదుచ్చేరి మంత్రి ఆరోపిసస్తున్నారు. ఎంఎస్ఎన్ స్కూల్లో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించడానికి ప్రభుత్వానికి 45 రోజుల గడువు ఇచ్చారు. భూముల పరిరక్షణ కమిటీకి అన్ని రకాలుగా సహకరిస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రకటించారు. దీనిపై ఎంపీ కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి వివరణ రాలేదు.