చాలా కాలానికి టిఆర్ఎస్ అద్యక్షుడు కెసిఆర్ ప్రకటించిన నూతన కార్యవర్గంలో 22 మంది ప్రధాన కార్యదర్శులు వుండటం ఆశ్చర్యమే. సెక్రటరీ జనరల్ కె.కెశవరావు పాత్ర నామమాత్రమేనని గతంలోనే తేలిపోయింది. ఇప్పుడు ప్రధాన కార్యదర్శులలో నీడలా తనను వెన్నంటి వుండే జోగులపల్లి సంతోష్‌కుమార్‌ను నియమించడం కొత్త పరిణామం. అధినేతకు మరో సంతోష్ టిన్యూస్ ఎండిగా తరచూ కెసిఆర్ పక్కన ఫోటోల్లో కనిపిస్తుంటారు. వాస్తవానికి ఉద్యమ కాలం నుంచి ఆయన కార్యక్రమాలు కదలికలు కలయికలు అన్ని సంతోష్ సమన్వయం చేస్తుంటారు. మీడియాలో వచ్చిన రావలసిన అంశాలనూ నిర్దేశిస్తుంటారు. ఇవన్నీ నిజమే గాని పార్టీలో లేదా ప్రభుత్వంలో అధికారికంగా ఎలాటి పాత్ర పోషించేవారు కాదు. ప్రత్యక్ష రాజకీయాలు ఎన్నికల పోటీ పట్ల ఆసక్తి వున్నట్టు చెప్పబడుతున్న సంతోష్ కుమార్ ప్రస్తుత నియామకంతో ఒక ప్రధాన స్తానంలోకి వచ్చినట్టే. సంతోష్ కెసిఆర్ మరదలి కుమారుడు.ఇప్పటివరకూ అగ్రనాయకుడుగా వున్న పెద్ద మేనల్లుడు హరీశ్ రావు స్థానంపైనే సంక్లిష్టతలు అలుముకుంటూ వుంటే అధినేతకు అతి దగ్గరగావుండే మరో సన్నిహిత కుటుంబ సభ్యుడైన యవకుడు కీలకపదవిలోకి రావడం.. ఇప్పుడు ఆ నలుగురు మారతారా లేక సోషల్ మీడియాలో అదేపనిగా చెబుతున్నట్టు ఆ అయిదుగురు అనే పరిస్థితి వస్తుందా? చూడాలి! ఎంతైనా ప్రథమ కుటుంబం కదా! ఇంతమంది ప్రధాన కార్యదర్శులు అయ్యాక అధినేత ఎంచుకున్న వారికి తప్ప మిగిలిన వారికి ఎలాగూ రాష్ట్ర హౌదా వుండదు.. అందుకే కొన్ని పత్రికలు కెసిఆర్‌తో పాటు సంతోష్ ఫోటోనే ప్రచురించాయి. ఎంఎల్‌సి పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ముఖ్యంగానే వ్యవహరిస్తారు. మిగిలిన ప్రధాన కార్యదర్శులు వారికి అప్పగించిన పది నియోజకవర్గాల బాధ్యత చూడొచ్చునేమో. కార్యవర్గంలో వారికి తలకు మూడు చొప్పున అప్పగిస్తారట.