జబర్దస్త్ పుణ్యమా అని చాలామంది పాపులర్ అయిపోయారు. కొంతమంది ఆ పేరుని కాపాడుకుంటూ… ఎదిగారు. ఇంకొంతమంది ఆ క్రేజ్ ని సరిగా వాడుకోలేకపోయారు. ఇప్పటికీ జబర్దస్త్ ఎంతోమందికి ఆసరా ఇస్తోంది. స్టార్లని చేస్తోంది. అలా జబర్దస్త్ వల్ల పాపులర్ అయిన ఓ నటుడికి మెగాఫోన్ అంటే మోజు పుట్టింది. తన సొంతూర్లోనే ఓ నిర్మాతని పట్టాడు. పరిశ్రమ మరచిపోతున్న ఓ మాజీ హీరోని తీసుకొచ్చి… క్లాప్ కొట్టించాడు.
క్లాప్ కొట్టి చాలా రోజులై అయినా ఇప్పటి వరకూ ఈ సినిమా ప్రారంభం కాలేదు. కాకపోతే ఆఫీసు కూడా తెరచి హడావుడి చేశాడు. అడ్వాన్సుల పేరిట తెగ ఖర్చు పెట్టించాడు. ఆఫీసులో రోజు వారీ ఖర్చులే వేలకు వేలు ఉన్నాయ్ట. ఇప్పటికి 20 లక్షల ఖర్చు తేలింది. అయితే ఇప్పుడు దర్శకుడికీ నిర్మాతకీ విబేధాలొచ్చాయి. `నా డబ్బులు నాకిచ్చేయ్` అని నిర్మాత గోల పెడుతున్నాడు. ఈ విషయంలోనే ఇద్దరికీ పడడం లేదు. దాంతో నిర్మాత ఫిల్మ్‌ఛాంబర్ లో ఫిర్యాదు చేయాలనుకుంటున్నాడట. ఇప్పట్లో ఒకర్ని నమ్మి ఒక అవకాశం ఇవ్వడమే గొప్ప. దర్శకత్వంలో ఎలాంటి అనుభవం లేని నటుడికి, సొంతూరు అభిమానంతో అవకాశం ఇచ్చాడు నిర్మాత. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి కదా? సినిమా మొదలవ్వకముందే 20 లక్షలు ఖాళీ చేస్తే.. సినిమా పూర్తయ్యేసరికి ఎంత తేలుతుందన్న భయం వెంటాడే సరికి నిర్మాత వెనక్కి తగ్గాడు. మరి ఈ 20 లక్షలు వెనక్కి ఎలా వస్తాయో.??