ఈటీవీలో సగం ఎంటర్టైన్మెంట్ పోగ్రాములు మల్లెమాలవే. జబర్దస్త్, పటాస్, ఎక్ట్సా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ… ఇలా ఆయా స్లాట్స్ని మల్లెమాల కొనుక్కొంటుంది. ఆ టైమ్లో కొన్ని పోగ్రామ్స్ని రూపొందించి ఈటీవీకి ఇస్తుంది. అవి ఈటీవీలో వస్తాయి. అలా మల్లెమాల, ఈటీవీలది సూపర్ హిట్ కాంబో అయిపోయింది. ఈటీవీ వల్ల మల్లెమాల ఎంత లాభపడిందో, మల్లెమాల వల్ల ఈటీవీ అంతే ఆదాయం తెచ్చుకొంది. ఈ కాంబోకి కనకవర్షం కురిపించిన పోగ్రాం.. జబర్దస్త్. అందులోంచే మిగిలిన వినోద భరితమైన కార్యక్రమాలన్నీ పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు జబర్దస్త్లోని వాళ్లంతా ఒకొక్కరుగా వెళ్లిపోతున్నారు. నాగబాబు, రోజా, సుడిగాలి సుధీర్, అనసూయ వెళ్లిపోయాక.. జబర్దస్త్ బోసిబోయింది. ఛమక్ చంద్ర, అవినాష్, ఆర్పీ లాంటి వాళ్లు ఎప్పుడో సైడ్ అయిపోయారు. జబద్దస్త్ ని వీడిన వాళ్లంతా.. మల్లెమాలనీ, ఈటీవీని పల్లెత్తు మాట అనలేదు. కాకపోతే ఆర్పీ మాత్రం మల్లెమాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మల్లెమాల పరువంతా తీసేశాడు.
భోజనాల విషయంలో మల్లెమాల కక్కుర్తి అంతా ఇంతా కాదని ఆర్పీ చెప్పుకొచ్చాడు. వాళ్ల ప్రొడక్షన్ ఫుడ్ దారుణాతి దారుణంగా ఉంటుందట. ఆర్టిస్టులకు అస్సలు విలువ ఇవ్వరని, బానిసల్లా ట్రీట్ చేస్తారని ఆర్పీ ఘాటైన వ్యాఖ్యలే చేశాడు. “జబర్దస్త్ వల్ల మేమంతా లాభపడ్డామన్నది ఎంత నిజమో.. మా వాళ్ల జబర్దస్త్ కూడా అంతే లాభపడిందన్నది అంత కంటే నిజం. కానీ మాకు ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇన్ని వార్షికోత్సవాలు జరిగాయి. ఒక్కసారి కూడా మమ్మల్ని ఇంటికి పిలిచి ఒక్క పార్టీ ఇవ్వలేదు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే పట్టించుకోరు. `నువ్వెంత` అన్నట్టు ప్రవర్తిస్తారు. అందుకే.. జబద్ దస్త్ నుంచి ఒకొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు“ అని చెప్పుకొచ్చాడు ఆర్పీ.
ఇది వరకు ముక్కు అవినాష్ కూడా ఈ విషయంలోనే బాధ పడ్డాడు. బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు… ఎగ్రిమెంట్ ప్రకారం మరో షోకి వెళ్లాలంటే రూ.10 లక్షలు కట్టాల్సిందే అని షరతు విధించార్ట. ఆ డబ్బులు కట్టి.. అప్పుడు బయటకు వచ్చానని, అందుకోసం అప్పులు చేయాల్సివచ్చిందని వాపోయాడు.
మల్లెమాల ప్రతిష్టాత్మక సంస్థ. బుల్లి తెరలో అగ్రగామిగా ఉంది. అలాంటప్పుడు నటీనటులకు తిండి పెట్టడానికి కక్కుర్తి పడడం ఏమిటి? ఎవరివల్ల అయితే కార్యక్రమం హిట్టయ్యిందో వాళ్ల కష్టాన్ని గౌరవించాలి కదా? ఈ విషయంలో మల్లెమాల నిర్వాహకులు ఎందుకంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు? సుడిగాలి సుధీర్, అనసూయ లాంటి వాళ్లు బయటకు వెళ్లిపోవడానికి కూడా ఇలాంటి విషయాలే కారణమని తెలుస్తోంది. వారిద్దరూ నోరు విప్పితే ఇంకెన్ని విషయాలు చెబుతారో?