Jabilamma Neeku Antha Kopama Movie review
తెలుగు360 రేటింగ్: 2.75/5
యాక్షన్ డ్రామాలూ, వరల్డ్ బిల్డింగ్ కథలు, పాన్ ఇండియా ప్రాజెక్టుల మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీల్ని మర్చిపోతున్నారు దర్శకులు. యువతరం ప్రేమ, ఎడబాటు, సంఘర్షణ, అందులోంచి పుట్టుకొచ్చే వినోదం.. ఎంత కాలమైనా ఎవర్ గ్రీన్. ఈ కథలు రొటీన్‌గానే ఉండొచ్చు. తీయగల నేర్పు తెలియాలే కానీ, యువతరం ప్రేక్షకుల్ని ధియేటర్లకు రప్పించే సత్తా ఉన్న జోనర్ ఇది. ఈ తరహా కథలతోనే ఫాలోయింగ్ సంపాదించుకొన్న ధనుష్ – ఇప్పుడు ఇదే జోనర్లో ఓ ప్రేమకథని తెరకెక్కించాడు. అదే ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. ధనుష్ దర్శకుడు కావడం, ఓ లవ్ స్టోరీని ఎంచుకోవడంతో ఈ సినిమాపై ఫోకస్ పడింది. మరి ధనుష్ ఈసారి ఎలాంటి ప్రేమకథని చెప్పాడు? దర్శకుడిగా తన ప్రయత్నం ఆకట్టుకొందా?
ప్రభు (పవీష్) హోటెల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుంటాడు. చెఫ్ కావాలన్నది తన కల. నీల (అనైకా)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. నీల కూడా ప్రభుని ఇష్టపడుతుంది. నీల ఓ పెద్దింటి అమ్మాయి. ప్రభుది మిడిల్ క్లాస్. అందుకే నీల తండ్రి (శరత్ కుమార్) ఈ ప్రేమని ఒప్పుకోడు. కానీ కూతురి కోసం కొన్నాళ్లు ప్రభుతో కలసి ప్రయాణం చేయడానికి ఒప్పుకొంటాడు. ఈ ప్రయాణంలో నీల తండ్రి గురించి ప్రభుకి ఓ నిజం తెలుస్తుంది. ఆ తరవాత.. మెల్లగా నీలని దూరం పెడతాడు ప్రభు. ఈ ఎడబాటు… ఇద్దరి మధ్య బ్రేకప్‌కి కారణమవుతుంది. ఆ తరవాత నీల మరొకర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఆ పెళ్లికి రమ్మంటూ ప్రభుకి శుభలేఖ కూడా పంపుతుంది. మరి ప్రభు ఆ పెళ్లికి వెళ్లాడా? వెళ్లి ఏం చేశాడు? అసలు నీలను ప్రభు ఎందుకు దూరం పెట్టాల్సివచ్చింది? చివరికి ఏమైంది? అనేది మిగిలిన కథ.
ఈ సినిమా ట్రైలర్లోనే ధనుష్ ఓ మాట చెప్పాడు. ఇదో సాదా సీదా కథ అని ముందే ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసేశాడు. ఔను.. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మామూలు కథే. అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం, స్టేటస్ వాళ్ల ప్రేమకు అడ్డు రావడం, ఇద్దరూ విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం – ఇలా చాలా పరమ రొటీన్ లైన్ పట్టుకొన్నాడు ధనుష్. కానీ స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేశాడు. సన్నివేశాలన్నీ సరదా సరదాగా రాసుకొన్నాడు. ప్రభు లవ్ బ్రేకప్ బాధలతో కథని నింపాదిగా మొదలెట్టాడు ధనుష్. ఆ తరవాత పెళ్లి చూపుల వ్యవహారం. అక్కడ ప్రియా వారియర్ రాకతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఎప్పుడైతే… ప్రభు తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని చెప్పడం మొదలెడతాడో అక్కడి నుంచి ఫన్ రైడ్ మొదలైంది. నీల – ప్రభుల లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవొచ్చు. కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానంలో మ్యాజిక్ ఉంది. ఆ సీన్స్ అన్నీ యువతరానికి నచ్చేస్తాయి. నీల – ప్రభుల ప్రేమకథకు సమాంతరంగా వాళ్ల స్నేహితుల లవ్ స్టోరీ నడుస్తుంటుంది. ఈ రెండు లవ్ స్టోరీలకూ రన్నింగ్ కామెంట్రీగా రాజేష్ (మాధ్యూ ధామస్)ని వాడుకొన్నారు. రాజేష్ పాత్ర ద్వారా మంచి వినోదం పండుతుంది. ఆ పాత్రనీ, తన డైలాగుల్నీ ఈతరం బాగా ఆస్వాదిస్తుంది. శరత్ కుమార్ పాత్ర చాలా రొటీన్‌గా ఉంటుంది. అయితే ఆ ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగేలోపే.. ”ఈయనేంట్రా.. మరీ ఎయిటీస్‌లో విలన్ లా ఆలోచిస్తున్నాడు” అంటూ హీరో తల్లి పాత్రతోనే ఓ డైలాగ్ వేయించేశారు. దాంతో.. ప్రేక్షకుల్లో ఓ సంతృప్తి. అయితే క్రమంగా శరత్ కుమార్ పాత్రకూ ఓ వెయిటేజ్ కల్పించాడు.
ద్వితీయార్థం అంతా పెళ్లి గోలే. మెహందీ, సంగీత్, పెళ్లి.. అక్కడ జరిగే హడావుడి, కలిసే కొత్త పాత్రలు… వీటి ద్వారా వినోదం పంచాడు. ధనుష్ దగ్గర నచ్చిన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలోని స్త్రీ పాత్రల్ని అందంగా రాసుకొన్నాడు. హీరోని ప్రేమించే ముగ్గురు అమ్మాయిలూ చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. పెళ్లిలో ఎదురయ్యే అంజలి పాత్ర కూడా ఎట్రాక్టీవ్‌గా ఉంటుంది. నిజానికి ఇలాంటి కథల్ని సెకండాఫ్ లో డీల్ చేయడం చాలా కష్టం. ధనుష్ ఆ కష్టాన్ని కూడా ఈజీగా దాటేశాడు. ప్రేమించిన అమ్మాయి మరొకర్ని పెళ్లి చేసుకొంటుంటే.. ఆ పెళ్లికి వెళ్లిన ప్రేమికుడు దేవదాస్‌లా మారిపోయి, వేదాంతం వల్లిస్తుంటాడు. కానీ ఇందులో హీరో తన బాధని మనసులో దాచుకొని జోవియల్‌గా తిరిగేస్తుంటాడు. అయితే ఆ బాధని, ఆవేదననీ అవసరమైన చోట పూర్తిగా ప్రదర్శించేశాడు. ఆ సన్నివేశం ధియేటర్లో బాగా పే ఆఫ్ అవుతుంది. క్లైమాక్స్ కూడా సరదాగా ఉంది. పార్ట్ 2కి అక్కడ లీడ్ ఇచ్చాడు ధనుష్. ఈ సినిమాలో ప్రేమకథలన్నీ అసంపూర్తిగానే ఉంటాయి. అయినా సరే, మనసులో ఓ సంతృప్తి. పార్ట్ 2లోనూ కథని నడిపించేంత స్టఫ్.. ఈ సినిమాకు ఉంది.
నిజానికి ధనుష్ ఇది తన కోసం రాసుకొన్న కథ. తనే హీరోగా చేద్దామనుకొన్నాడు. కానీ చివర్లో నిర్ణయం మార్చుకొని తన మేనల్లుడి పవీష్ కి ఆ పాత్ర ఇచ్చేశాడు. పవీష్ బాగా నటించాడు. ఎక్కడా కొత్త కుర్రాడన్న ఫీల్ రాలేదు. అక్కడక్కడ ధనుష్‌ని ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. ముఖ్యంగా.. శరత్ కుమార్ దగ్గర దర్పం ప్రదర్శించే సన్నివేశంలో. పక్కింటి కుర్రాడు, మనకు తెలిసిన అబ్బాయి ఎలా ఉంటాడో.. అలా ఈ పాత్రని చేసుకొంటూ వెళ్లాడు. మంచి కథలు ఎంచుకొంటే, పవీష్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. అనైకా చాలా ముద్దుగా ఉంది. బాగా నటించింది కూడా. ముఖ్యంగా హీరో గురించిన నిజం తెలిసిన సన్నివేశంలో. అక్కడ తనకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. వెడ్డింగ్ ప్లానర్‌గా కనిపించిన అమ్మాయి చాలా సెలిల్డ్గా చేసింది. ప్రియా వారియర్ ది అతిథి పాత్ర అనుకోవొచ్చు. ఓ పాటలో.. ప్రియాంకా మోహన్ కనిపించింది. ఆ పాట మంచి జోష్ ఇస్తుంది. హీరో స్నేహితుడిగా కనిపించిన మాధ్యూస్ ప్రేమలో పడిపోతాం. అంత బాగా నటించాడు. ఆ పాత్రని కూడా అంతే బాగా తీర్చిదిద్దాడు ధనుష్.
టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. కెమెరా పనితనం నీట్ గా ఉంది. రెండో పాటని చాలా బాగా డిజైన్ చేశారు. అందులో చూపించిన సెట్ ప్రాపర్టీ కూడా కలర్ ఫుల్‌గా ఉంది. జీవీ ప్రకాష్ ఓ పాటలో కనిపించాడు. పాటలు క్యాచీగా లేవు కానీ, చూడ్డానికి బాగున్నాయి. ధనుష్ దర్శకుడిగా మెరిశాడు. సింపుల్ కథని చాలా అందంగా, ఆకర్షణీయంగా, కుర్రాళ్లకు నచ్చేలా చెప్పగలిగాడు. ధనుష్ కోసం రాసుకొన్న కథ ఇది. నిజానికి తనకు బాగా సూట్ అవుతుంది. తనే హీరోగా చేస్తే.. ఇంకా ఇంకా బాగుండేది. ఇప్పటికీ నష్టమేం లేదు. రొటీన్ లవ్ స్టోరీని ఓ ఫ్రెష్ ఫీల్ తో చూసిన అనుభూతి కలుగుతుంది. స్నేహితుల గ్యాంగ్ ఉంటే.. వాళ్లతో కలిసి వెళ్లండి. ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
తెలుగు360 రేటింగ్: 2.75/5