తెలంగాణ జేఏసీ ఎట్టకేలకు మళ్లీ క్రియాశీలకంగా మారింది. కేసీఆర్ కు తోక సంస్థగా విమర్శలు ఎదుర్కొన్న జేఏసీ, ప్రజల తరఫున వాణిని వినిపించడానికి సిద్ధమైంది. ఛత్తీస్ గఢ్ విద్యుత్ పి పి ఎ పై తొలి యుద్ధం ప్రకటించింది. ఆ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి భారమంటూ తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిటీకి ఫిర్యాదుచేసింది.
ఛత్తీస్ గఢ్ నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం మొన్న సెప్టెంబర్లో పి పి ఎ పై సంతకం చేసింది. అయితే అది రాష్ట్ర ఖజానాకు భారమని విమర్శలు వచ్చాయి. దీంతో, దీనిని సమీక్షించాలని జె ఎ సి కూడా సూచించింది. తాజాగా ఇ.ఆర్.సి.కి ఫిర్యాదు చేసింది. దీనిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలని, ఒప్పందాన్ని సమీక్షించాలని కోదండరాం డిమాండ్ చేశారు.
దీనికంటే ముందు, రైతుల సమస్యపై కోదండరాం స్వయంగా మొదటిసారి స్పందించారు. ప్రభుత్వ విధానాలు రైతు ఆత్మహత్యలను ప్రేరేపించేవిగా ఉన్నాయంటూ ఆయన హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందం సమీక్షించాలంటూ కొత్త ఉద్యమం మొదలుపెట్టారు.
తెలంగాణ ఉద్యమంలో జెఎసి కీలక పాత్ర పోషించింది. కేసీఆర్ అంటే గిట్టని ఎంతో మందిని, ఎన్నో సంఘాలను ఉద్యమంలోకి తీసుకురావడంలో కోదండరాం సఫలమయ్యారు. ఉద్యమం ఊరూవాడా విస్తరించి, ప్రజల నిజ జీవితంలో ఓ భాగంగా మారిందంటే ప్రధాన కారణం జె ఎ సి నే. అలాంటి జేఏసీని కేసీఆర్ సీఎం కాగానే విస్మరించారు. కూరలో కరివేపాకులా పక్కనబెట్టారు. జేఏసీతో అవసరం తీరిపోయిందన్నట్టు ప్రవర్తించారు. అయినా జేఏసీ నేతలు కిమ్మనలేదు. కేసీఆర్ పదవులిస్తారనే ఆశతో అలా అణిగిమణిగి ఉన్నారనే విమర్శలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని చాటుతూ, కోదండ రాం ప్రజల తరఫున మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు.
పలు రంగాల్లో ప్రభుత్వ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. నేలవిడిచి సాము చేసే తరహాలో ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. అవసరమైన ఖర్చు కాకుండా కొన్ని సార్లు అనవసరమైన ఖర్చు చేస్తోందనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపేలా కోదండరాం నాయకత్వంలోని జేఏసీ నడుం బిగిస్తే రాష్ట్రానికి మేలు కలుగుతుంది. ఈ దిశగా కోదండరాం చొరవను ఇప్పటికే చాలా మంది అభినందిస్తున్నారు.