ఆర్టీసీ జేయేసీ మరోసారి తమ నిరసన కార్యక్రమాల కార్యాచరణను ప్రకటించింది. ఆర్టీసీ జేయేసీ నాయకులు, విపక్షాల నాయకులు ఆదివారం సమావేశమై వచ్చేవారంలో చేపట్టాల్సిన కార్యాక్రమాలను నిర్ణయించారు. సోమవారం నాడు మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 13, 14వ తేదీల్లో ఢిల్లీ వెళ్లి మానవ హక్కుల కమిషన్ ని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇక, ఈ నెల 18న సడక్ బంద్, జైల్ భరో నిర్వహించాలని నిర్ణయించారు. శనివారం జరిగిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో గాయపడ్డ మహిళలంతా మహిళా కమిషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించారు. దీంతోపాటు, జేయేసీ కీలక నేతలు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టబోతున్నారు.
జేయేసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం విజయవంతమైందనీ, అయితే దీన్లో ప్రజా సంఘాలు, ఆర్టీసీ కార్మికులు మాత్రమే పాల్గొన్నారనీ, మావోయిస్టులు కలిసి వచ్చారని పోలీసులు తప్పుడుగా ఆరోపించడం సరికాదన్నారు. తాము చేపట్టబోతున్న దీక్షలకు అన్ని పార్టీల మద్దతు కోరుతామన్నారు. న్యాయస్థానం ఆదేశించినట్టుగా వెంటనే తమతో చర్చలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలన్నారు. హైకోర్టు తీర్పు రాకుండానే సుప్రీం కోర్టుకు వెళ్తామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులైనా స్పందించి.. కార్మికులతో చర్చలు జరిపే విధంగా సీఎం మీద ఒత్తిడి తేవాలన్నారు.
మరోవారం పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలను జేయేసీ మరోసారి ప్రకటించేసింది. ఇలా కార్యాచరణను వరుసగా ఇలా ప్రకటించడం ఇది రెండోసారి. గతవారంలో అనుకున్నట్టుగా నిరసన కార్యక్రమాలన్నీ చేశారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ముఖ్యమంత్రి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. సమ్మె ముగింపునకు ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రయత్నాలుగానీ, కార్మికుల సమ్మె తీవ్రతను ఒత్తిడి భావించి స్పందంచడంగానీ లేదు. న్యాయస్థానంలో మాత్రమే కార్మికుల సమస్యలకు పరిష్కారం దిశగా కొంతైనా ముందడుగు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. రాబోయే వారం కూడా ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలతో హోరెత్తే పరిస్థితే కనిపిస్తోంది.