ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న సామాజిక వెబ్ సైట్ ‘ట్వీట్టర్’ కి సీ.ఈ.ఓ.గా విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ నియమితులయ్యే అవకాశం ఉందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చేయి. కానీ ట్వీట్టర్ వ్యవస్థాపకుల్లో ఒకరయిన జాక్ డోర్సీ నియమితులవబోతున్నట్లు తాజా సమాచారం. ఆయన గత కొన్ని నెలలుగా ట్వీట్టర్ తాత్కాలిక సీ.ఈ.ఓ.గా బాధ్యతలు నిర్వర్తిసున్నారు. కనుక ఆయనకే పూర్తి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఈరోజు సాయంత్రంలోగా దీనిపై ట్వీట్టర్ సంస్థ ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాక్ డోర్సీ ట్వీట్టర్ తాత్కాలిక సీ.ఈ.ఓ.గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తను స్థాపించిన “డిజిటల్ పేమెంట్ సర్వీస్ స్క్వేర్” అనే సంస్థను కూడా చూసుకొంటున్నారు. ఒకవేళ ట్వీట్టర్ సీ.ఈ.ఓ.గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ దానిని కూడా ఆయన చూసుకొంటారని సమాచారం.వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన “ఎం.ఐ.టి.టెక్నాలజీ రివ్యూ టి.ఆర్-35” లో భాగంగా ఎంపిక చేసిన 35 మంది మేటి ఆవిష్కరణ కర్తలలో జాక్ డోర్సీ కూడా ఒకరు. అందుకు గాను ఆయనకి 2012సం.లో టెక్నాలజీ రంగంలో “ఇన్నోవేటర్ ఆఫ్ ద ఇయర్” అవార్డు కూడా అందుకొన్నారు.