Jack Movie Review
తెలుగు360 రేటింగ్: 2/5
శిల్పి గొప్పవాడైతే ఎలాంటి రాయినైనా శిల్పంగా మార్చేస్తాడు. అలా చెక్కిన శిల్పాలు గుళ్లో విగ్రహాలుగా మారి పూజలూ అందుకొంటాయి. సగం చెక్కిన శిల్పాలే.. అవి రాయిగానూ ఉండవు. ఓ రూపాన్నీ సంతరించుకోవు. ఎటూ కాకుండా మిగిలిపోతాయ్. కొన్ని కథలూ అంతే. దర్శకుడు బాగా చెక్కితే…. శిల్పాలుగా మిగులుతాయి. లేదంటే శిధిలాలుగా మారతాయి. ఎందుకో ‘జాక్’ సినిమా చూస్తుంటే.. అదే గుర్తొస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ తీసిన సినిమా ఇది. ఆయనకంటూ ఓ స్టైల్ వుంది. ఇందులో హీరో.. సిద్దు జొన్నలగడ్డ. ఆయనకంటూ ఓ స్టైల్ ఏర్పడింది. రెండింటినీ మిక్సీలో వేస్తే…. ఆ సినిమా ఎలాంటి రూపం సంతరించుకొంది? శిల్పమైందా, శిధిలంగా మారిందా?
జాక్ అని పిలుచుకొనే పాబ్లో నెరోడా (సిద్దు జొన్నలగడ్డ) కథ ఇది. తను చాలా టాలెంటెడ్. చిన్నప్పటి నుంచి ఏవోవో కావాలని కలలు కంటుంటాడు. క్రికెట్, ఫుట్ బాల్, టెన్నీస్ ఇలా అన్నీ ట్రై చేస్తాడు. కానీ కోచ్ చెప్పినట్టు వినడు. ప్రతీ ఆట ఆడడానికి తనకంటూ ఓ సెపరేట్ పంథా ఉంటుంది. అందుకే 24 కోచ్‌లు ‘వీడ్ని ట్రైన్ చేయడం మా వల్ల కాదు’ అని వదిలేస్తారు. ఇలాంటి వాడు.. ‘రా’ ఏజెంట్ కావాలనుకొంటే ఎలా ఉంటుంది? అనేదే కథ.
హైదరాబాద్ తో సహా దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు ఓ ప్లాన్ వేస్తారు. దాన్ని ఛేదించడానికి `రా` రంగంలోకి దిగుతుంది. ఈ మిషన్కి హెడ్ మనోజ్ (ప్రకాష్‌రాజ్). రా పరీక్షలు రాసి, ఇంటర్వ్యూ ఫేస్ చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటాడు జాక్. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని, దేశాన్ని కాపాడే మిషన్స్ కూడా చేస్తుంటాడు. అందులో భాగంగా మనోజ్ చేస్తున్న మిషన్‌ని ముందే పసిగట్టి, ఉగ్రవాదుల్ని పట్టుకొనేందుకు ప్లాన్ వేస్తాడు. మరి జాక్ ఈ మిషన్ లో ఎంత వరకూ సక్సెస్ అయ్యాడు? ‘రా’లో తనకు చోటు దక్కిందా? అనేది మిగిలిన సినిమా.
‘వీడు కొంచెం క్రాక్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. దానికి తగ్గట్టుగానే ఇందులో హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు భాస్కర్. ఓ రూల్ ప్రకారం, థియరీ ప్రకారం కాకుండా అడ్డదిడ్డంగా తన పనుల్ని తాను చేసుకొంటూ వెళ్లిపోయే హీరో కథ ఇది. నిజానికి ఇంట్రస్టింగ్ పాయింటే. సినిమాకి పనికొచ్చే విషయం ఉంది. భాస్కర్ చేప్పిన ‘రాయి – శిల్పం’ థియరీ ప్రకారం… బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర శిల్పం చెక్కడానికి అనువైన రాయి అయితే వుంది. అయితే… దాన్ని శిల్పంగా మార్చే క్రమంలో చాలా తప్పులు చేశాడు.
పోలీసులు దేశంలో లోపల ఉంటారు. సైన్యం సరిహద్దు బయట ఉంటుంది. ఒక్క ‘రా’ ఏజెంట్ మాత్రమే దేశానికి ముందు ఉండి ప్రమాదాన్ని రాకుండా ఆపుతాడు అంటూ ‘రా’ గురించి గొప్పగా ఒక్క ముక్కలో చెప్పేశాడు భాస్కర్. ‘రా’ గొప్పదనం అది. అయితే… అంత గొప్ప వ్యవస్థని ఏదో ఆట వస్తువుగా చూపించడం మాత్రం హర్షించదగిన పరిణామం కాదు. ‘రా’ చేయలేని పనుల్ని ఛేదించలేని విషయాల్ని, తెలుసుకోలేని సంగతుల్ని ఒక ఆకతాయి చేస్తూపోవడం ‘రా’ గొప్పదనం అనుకొంటే ఎలా? ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి రా రంగంలోకి దిగుతుంది. అదే ఉగ్రవాదుల్ని హీరో వెంటాడుతుంటాడు. ఆ హీరోని హీరోయిన్ వెంబడిస్తుంటుంది. సినిమా అంతే ఇదే ఫ్లో. దేశాన్ని కాపాడడమే జాక్ లక్ష్యం అయినప్పుడు తానెందుకు.. ‘రా’కి సహాయం చేయకూడదు? ఆ క్రెడిట్ తన జేబులోనే వేసుకోవాలని ఎందుకు చూస్తుంటాడు? ‘రా’లో ఎంట్రీ ఇంత సులభమా? ఇలాంటి ప్రశ్నలు సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల్ని వెంటాడుతుంటాయి. మనోజ్ (ప్రకాష్ రాజ్) పాత్ర అటు సీరియస్ గా ఉండదు. అలాగని.. బఫూన్లానూ కనిపించదు. రెండింటికి మధ్య ఊగిసలాడుతుంటుంది. ఈ సినిమా కూడా అంతే. సుబ్బరాజు పాత్ర కూడా అంతే. తనో ఐఏఎస్ ఆఫీసర్. ‘రా’ ఏజెంట్ అవుదామనుకొంటాడు. ఐఏఎస్ ఆఫీసర్.. ‘జాక్’ చెప్పినట్టు ఆడుతుంటాడు. డిపార్ట్మెంట్ లోని సీరియస్ నెస్ ‘జాక్’కి అర్థం కాదంటే ఓ అర్థం కాదు. కానీ… ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కు తెలియకపోవడం ఏమిటి? ‘నువ్వు సెలవు పెట్టి నాతో వచ్చేయ్.. మనం ఇక నుంచి `రా` ఏజెంట్స్’ అని జాక్ చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా తలాడించుకొంటూ వచ్చేస్తాడు. సిల్లీగా.
రా, ఉగ్రవాదం ఇలాంటి కథల్ని ఎంత సీరియస్‌గా చెబితే ఆ కథలోని డెప్త్ అంత త్వరగా అర్థం అవుతుంది. కానీ ఈ సినిమాని చాలా సిల్లీగా తీసుకొంటూ వెళ్లారు. దాంతో ప్రేక్షకులకూ కథలోని సీరియస్ నెస్ పట్టదు. ‘ఏదో జరుగుతోందిలే’ అనే ఫీలింగ్ తప్ప.. ‘ఏం జరగబోతోందో’ అనే ఉత్కంఠత కలగదు. ప్రేక్షకులకు టైమ్ పాస్ ఇస్తూ, వినోదాన్ని పంచడమే దర్శకుడి లక్ష్యం అయితే ఈ సినిమాని పూర్తిగా ‘టిల్లు’ స్టైల్ లో తీసేయాల్సింది. దానికి భాస్కర్ మనసు ఒప్పుకోలేదు. అలాగని సిద్దుకున్న ఇమేజ్‌ని వాడుకోకుంకుండా ఉండలేడు. అందుకే మధ్యమధ్యలో ‘టిల్లు’ వస్తూ పోతూ ఉంటాడు. అన్నట్టు ఈ సినిమాలో ‘టిట్లు’ రిఫరెన్సులు కూడా కొన్ని ఉన్నాయ్. కానీ అవన్నీ నాన్ సింక్‌గా తయారయ్యాయి. క్లైమాక్స్ ఫైట్ తో సిద్దుకు ఓ యాక్షన్ ఇమేజ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. నేపాల్ లో సీన్లన్నీ అటు కాలక్షేపాన్నీ ఇవ్వలేదు. అలాగని డ్రామానీ పండించలేదు.
సిద్దు జొన్నలగడ్డ అనగానే డీజే టిల్లుగా తాను పంచిన వినోదం గుర్తిండిపోతుంది. ఆ ఇమేజ్ తనకెంత వరమో, అంత శాపం కూడా. సిద్దు పాత్రలు అంత ఎనర్జిటిక్‌గా ఉంటే తప్ప ఎక్కవు. అక్కడక్కడ టిల్లు పాత్రని గుర్తు చేసేలా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ మార్చుకొంటూ వెళ్లాడు. ఆయా సీన్లు కాస్త నవ్విస్తాయి. మిగిలిన చోట్ల సిద్దు దొరికిపోతాడు. ఈ సినిమాకు ‘జాక్’ అని కాకుండా `టిల్లు 3` అని పెట్టి, టిల్లు పాత్రనే `రా` ఏజెంట్ గా చేసేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ‘బేబీ’ తరవాత వైష్ణవి చైతన్యకు పెద్దగా హిట్లు లేవు. తన సినిమాలేం గుర్తు పెట్టుకొనేలా లేవు. ‘జాక్’ సైతం ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. భాస్కర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు బాగుంటాయన్న పేరుంది. ఆ పేరుకి కనీస న్యాయం జరగలేదు. ప్రకాష్ రాజ్ పాత్ర కూడా అలానే తయారైంది.
ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అన్నీ బొమ్మరిల్లు భాస్కర్. తన మార్క్ ఏమాత్రం కనిపించని సినిమా ఇది. అలాగని ఈ సినిమాని సిద్దు స్టైల్ కి తగ్గట్టుగా కూడా తీయలేకపోయారు. దానికి కారణాలేంటి అనేది భాస్కర్‌కే తెలియాలి. టైటిల్ సాంగ్ బాగుంది. కానీ గుర్తు పెట్టుకొనేలా లేదు. పాటలకు పెద్దగా స్కోప్ లేదు. నేపథ్య సంగీతంలోనూ మెరుపులేం కనిపించలేదు. ‘రాయి – శిల్పం’ డైలాగ్ కొన్ని చోట్ల కోడ్ చేశారు కాబట్టి మళ్లీ అక్కడికే వచ్చి ఆగాల్సివస్తోంది. ఈ శిల్పాన్ని సరిగా చెక్కలేదు. ఆ లోపం శిల్పిదే.
తెలుగు360 రేటింగ్: 2/5