హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వచ్చేందుకు ప్రయత్నిస్తున్న … ఏపీ వాసులులందరూ.. ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండిపోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం నుంచి ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున జనం గుమికూడి ఉన్నారు. హైదరాబాద్ నుంచి కొన్ని వేల మంది.. ఏపీలోని సొంత ఊళ్లకు వెళ్లేందుకు తరలి వచ్చారు. అక్కడి పోలీసులు ఎన్వోసీలు జారీ చేయడంతో.. వాటిని తీసుకుని.. ఏపీలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ వారందర్నీ పోలీసులు అనుమతించలేదు. ఇది వివాదాస్పదమయింది. దీంతో ముఖ్యమంత్రి.. అందరికీ.. ఎక్కడ ఉన్న వాళ్లు అక్కడే ఉండిపోవాలని కోరేందుకు ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే… ఎక్కడ ఉన్న వాళ్లు అక్కడే ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లో ఉన్న వారికి తిండి, వసతి సౌకర్యాలకు కష్టం అయితే.. వాటిని తెలంగాణ సీఎం కేసీఆర్ కల్పిస్తామని హామీ ఇచ్చారని.. తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి మరీ చెప్పారని.. ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ నుంచి ఎవరూ రావొద్దన్నారు. హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు.. ఏపీలో కూడా.. జిల్లాల మధ్య.. ఊళ్ల మధ్య కూడా… రాకపోకలు వద్దని కోరారు. ఇలా ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే.. ఎవరు ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని.. అది కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆటంకమన్నారు.
ఏపీలో ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఎదురైనా 1902 కి ఫోన్ చేస్తే సౌకర్యాలు కల్పిస్తామన ప్రకటించారు. ఆరోగ్య పరమైన సమస్యలకు 104 కాల్ సెంటర్కి ఫోన్ చేయాలన్నారు. దేశంలో ఎక్కడి వారైనా.. కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే. కేంద్రం సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. గంటల తరబడి.. కొంత మంది ఏపీ బోర్డర్లో ఉండిపోవడంతో.. కొంత మందిని రాష్ట్రంలోకి అనుమతించామని వారంతా క్వారంటైన్లోనే ఉండాలని స్పష్టం చేశారు. కరోనా వైరస్ నిరోధానికి ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలను జగన్ వివరించారు. నిత్యావసర వస్తువులు.. కూరగాయలను ఇళ్ల మధ్యనే అమ్మే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏపీలో కేవలం పదే పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న సీఎం.. పెరగకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలని.. అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఐదు గంటలకు ప్రెస్మీట్ అని మీడియాకు సమాచారం ఇచ్చినా.. ఆరు గంటల తర్వాతే ప్రెస్మీట్ ప్రారంభమయింది. చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు కానీ.. జర్నలిస్టులకు ఒక్క ప్రశ్న అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు.