రీ రిలీజులు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. వారానికి ఒక సినిమా అయినా థియేటర్లో మెరుస్తోంది. అదేంటో గానీ…. వాటికి ఆదరణ కూడా బాగుంటోంది. కొత్త సినిమాలకు లేని ఫుట్ ఫాల్స్.. రీ రిలీజులకు కనిపిస్తున్నాయి. చిరంజీవి సినిమాల్లో ‘ఇంద్ర’ రీ రిలీజ్ రూపంలో వచ్చింది. వాటికి మంచి వసూళ్లు అందాయి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాని రీ రిలీజ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ఇప్పటికి మోక్షం లభించింది. మే 9న ఈచిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. అందులోనూ త్రీడీ వెర్షన్లో.
పాత సినిమాల్ని 4కే టెక్నాలజీతో కొత్తగా ముస్తాబు చేయడం చూస్తూ వచ్చాం. ఇప్పుడు కొత్తగా త్రీడీ సొబగులు మిక్స్ చేశారన్నమాట. జగదేక వీరుడు లాంటి ఫాంటసీ సినిమాని త్రీడీలో చూడడం కొత్తగానే ఉంటుంది. పైగా మే 9.. జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయిన డేట్. అదే రోజున ఇప్పుడు రీ రిలీజ్ రూపంలో వస్తోంది. నిజానికి ‘విశ్వంభర’ సినిమాని మే 9నే విడుదల చేద్దామనుకొన్నారు. పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు కూడా అదే రోజున తీసుకొద్దామనుకొన్నారు. కానీ కుదర్లేదు. ఎలాగైతేనేం.. ఆ రోజున ఓ మెగా సినిమా వస్తోంది. ఫ్యాన్స్కి ఈ ఉత్సాహం చాలు.
రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమా ఇది. శ్రీదేవి గ్లామర్, ఇళయరాజా మ్యూజిక్.. మ్యాజిక్ చేశాయి. చిరు – శ్రీదేవి జంటని చూడ్డానికే జనాలు మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లేవారట. ఓతరాన్ని ఊపేసిన ఈ సినిమా ఇప్పుడు ఈతరాన్ని ఎలా థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.