హీరోకి ఓ ఇమేజ్, దర్శకుడికి ఓ బ్రాండ్.. ఉండాలని కోరుకుంటారు. అవి పడిపోతే… వాళ్లు ఆయా రంగాల్లో నిలబడిపోయినట్టే. కాకపోతే… ఇమేజ్, బ్రాండ్ అనేవి వాళ్ల కెరీర్‌కి అనుకోని అడ్డుగోడలుగా మిగిలిపోతాయి. వాళ్లనుంచి `అంతకు మించి` అంటూ అద్భుతాలేవో ఆశిస్తుంటారు. సగటు సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువు. కార్తీక్ సుబ్బరాజుకంటూ ఓ బ్రాండ్ ఏర్పడిపోయింది. పిజ్జా, జిడత్తాండలతో తానేంటో నిరూపించుకున్నాడు. ఏకంగా రజనీకాంత్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. రజనీతో చేసిన `పేట్టా` ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు రజనీ అల్లుడు ధనుష్ తో `జగమే తంత్రం` చేశాడు. మరి ఈసారైనా… కార్తీక్ తన పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా, లేదా? మామకి హిట్ ఇవ్వలేకపోయిన దర్శకుడు.. అల్లుడుతోనైనా అదుర్స్ అనిపించాడా? లేదా? నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలైన `జగమే తంత్రం`.. లో విషయం ఉందా, లేదా?
కథలోకెళ్తే… సురుళి (ధనుష్) ఓ లోకల్ దాదా. మధురైలో.. చిన్న చిన్న సెటిల్ మెంట్లు చేసుకుంటుంటాడు. మరోవైపు లండన్ లో శివదాస్ (జోసెఫ్ జోజు), పీటర్ (జేమ్స్ కోస్మో) అనే రెండు గ్యాంగ్ లు ఉంటాయి. శిదదాస్ ని అణచి వేయడానికి సురుళికి భారీగా డబ్బు ముట్టజెప్పి లండన్ రప్పిస్తాడు పీటర్. పీటర్ డబ్బులకు ఆశపడి… శివదాస్ ముఠా జోరుకి అడ్డుకట్ట వేసక్తాడు సురుళి. అంతేకాదు.. ఓ మాస్టర్ ప్లాన్ తో శివదాస్ ని కూడా చంపిస్తాడు. అక్కడితో కథ ముగిసిపోలేదు. అక్కడి నుంచి.. అసలు సమస్య మొదలవుతుంది. దానికి కారణం.. సురళి ప్రేమించిన అమ్మాయి అఖిల (ఐశ్వర్య లక్ష్మి). తన వల్లే…. సురిళిలో మార్పు వస్తుంది. అసలు అఖిల ఎవరు? తను సురిళిని ఎలా మార్చింది? అనేది మిగిలిన కథ.
ఓ లోకల్ దాదా.. లండన్ దాదాగా మారడం మంచి కమర్షియల్ కాన్సెప్ట్. ధనుష్ లాంటి హీరోకి ఈ మాత్రం లైన్ చాలు. అయితే.. కార్తీక్ సుబ్బరాజు కేవలం ఈ లైన్ కే పరిమితం అయిపోలేదు. శరణార్థులు అనే మరో పాయింట్ పట్టుకున్నాడు. శ్రీలంకలో శరణార్థుల బాధ నుంచి, ఇతర దేశాల్లో తమ ఉనికి కోసం, అస్థిత్వం కోసం, బతకడానికి కాస్త చోటు కోసం ప్రాకులాడుతున్న భారతీయుల బాధని చూపించాలనుకున్నాడు. అంటే ఒకే కథలో రెండు పాయింట్లున్నాయన్నమాట. నిజానికి దర్శకుడి మోటీవ్.. శరణార్థుల వైపు మాట్లాడాలనే. అయితే దానికి.. ఈ గ్యాంగ్ స్టర్ కథ అతక లేదు.
“ఒకడు ఎక్కడ పుట్టాడో అది కాదు వాడి సొంతూరు
వాడు ఎక్కడ జీవితం మొదలెట్టాడో అదే వాడి సొంతూరు“… అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. దర్శకుడు ఈ పాయింట్ చుట్టూనే కథ అల్లాలనుకున్నాడు. కానీ దానికి మాస్ మసాలా, హీరోయిజం, ఎలివేషన్లూ జోడించాలని తాపత్రయపడ్డాడు. అందుకే గ్యాంగ్ స్టర్ కథని తీసుకొచ్చాడు. చెన్నైలోని గ్యాంగ్ స్టర్ లండన్ కి రావడం, ఇక్కడ కాకలు తిరిగిన ఓ గ్యాంగ్ కి చెమటలు పట్టించడం.. ఇదంతా సినిమాటిక్ గా సాగిపోతుంది. అక్కడ కార్తీక్ సుబ్బరాజు తన మేధావితనాన్ని పక్కన పెట్టి, కమర్షియల్ దర్శకుడిగానే ఆలోచించాడు. ఆయా సన్నివేశాల్లో ధనుష్ బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రజెన్స్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. నిజం చెప్పాలంటే.. ధనుష్ మీసకట్టు, అతని హావభావాలు అన్నీ.. పక్కా తమిళ వాసన కొడుతుంటాయి. కాస్త ఓవర్ గానూ ఉంటాయి.
శివదాస్ చేస్తున్న ఇన్ లీగల్ పనులన్నీ తన తెలివితేటలతో కనిపెట్టే సన్నివేశాలు చాలా సిల్లీగా, లాజిక్ కి దూరంగా ఉంటాయి. శివదాస్ తో సెటిల్ మెంట్ సీన్ కాస్త బాగా తీశాడనిపిస్తుంది. ఆ తరవాత.. హీరోయిన్ వైపు నుంచి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అక్కడ శరణార్థుల టాపిక్ వస్తుంది. బై కోర్ అనే చట్టం గురించి ఐడియా లేకపోతే… పీటర్ అక్రమాలు అర్థం కావు. దాంతో.. సామాన్య ప్రేక్షకుడికి కనెక్షన్ కట్ అవుతుంది. జాతి వివక్షత అనే పాయింట్ ని కూడా దర్శకుడు కొన్ని సంభాషణలు, సన్నివేశాల్లో చెప్పాలనుకున్నాడు. కానీ.. అవేం ప్రేక్షకుడ్ని బలంగా తాకే విషయాలు కావు.
ధనుష్ కి ఇలాంటి పాత్రలు చేయడం కేక్ వాక్. తాను పెద్దగా కష్టపడలేదు. తనకు అలవాటైన దారిలో చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఐశ్వర్య లక్ష్మిది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. డ్యూయొట్లు లాంటివేం లేవు కాబట్టి. ఐశ్వర్యలో కేవలం పెర్‌ఫార్మ్సెన్స్ మాత్రమే చూసే అవకాశం దక్కింది. తెలుగు నటుల్ని చూసే అవకాశం, తెరపై కనిపించిన వాళ్లని పేర్లతో సహా గుర్తు పట్టే సౌలభ్యం రెండూ.. ఈసినిమాలో లేవు. సాంకేతికంగా చూస్తే… పాటలు పక్కా అరవ వాసన కొడతాయి. నేపథ్య సంగీతం ఇంగ్లీష్ సినిమాల అనుకరింపు గా వినిపిస్తుంది. దర్శకుడు ఓ బలమైన పాయింట్ ని కమర్షియల్ హంగులు జోడించి చూపించాలనుకున్నాడు. కానీ.. ఆ వంటకం సరిగా కుదర్లేదు. అటు హీరోయిజానికీ, శరణార్థులు అనే పాయింట్ కీ రెండింటికీ ఏరకమైన న్యాయం చేయలేకపోయాడు.