వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా అసలు చిక్కులు జగన్ రెడ్డి ప్రభుత్వమేనని తెచ్చి పెట్టినట్లుగా తెలుస్తోంది. అసలు వాలంటీర్ వ్యవస్థను జగన్ ప్రభుత్వమే రద్దు చేసింది. వాలంటీర్లు అనే వారు గత ప్రభుత్వం చివరి మూడు నెలల్లో లేరు. రాజీనామా చేసిన వారు చేయగా మిగిలిన వారిని కంటిన్యూ చేస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అంతకు ముందే వారిని విధుల్లోకి తీసుకున్న కాలం ముగిసిపోయింది. కొనసాగిస్తూ ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం జారీ చేయకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం వాలంటీర్ల సమస్యను ఎలాపరిష్కరించాలా అని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాజీనామా చేసిన వాళ్లు కూడా వైసీపీ నేతల బలవంతంతో రాజీనామా చేశామని కేసులు పెట్టేందుకు రెడీఅయ్యారు. అయితే ఈ వాలంటీర్లంతా తమ కార్యకర్తలేనని విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు బహిరంగంగా ప్రకటించుకున్నారు. వైసీపీ కోసమే వారు పని చేశారు. అలాంటి వారిని కొనసాగించి.. ఇబ్బందులు తెచ్చేలా చేసుకోవడం ఎందుకన్న వాదన ఉంది. ఈ వ్యవస్థపై చంద్రబాబు సానుకూలంగా లేకపోయినా అందులో ఉండి పదేళ్ల పాటు పని చేసిన వారిపై సానుభూతి ఉంది. అందుకే వారికి ఏదో ఓ దారి చూపించాలని అనుకుంటున్నారు.
త్వరలో వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ఓ ప్రత్యేక విధానం ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల్లో చెప్పినట్లుగావారికి పదివేల జీతంతోపాటు ఎక్కువ సంపాదించుకునేందుకు ఇతర పనుల్ని కూడా అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ లోపు వాలంటీర్లలో ఎవరెవరు ఇంకా వైసీపీకి పని చేస్తున్నారో .. ఎవరెవరు రాజకీయాలతో పని లేకుండా వాలంటీర్లుగా ఉంటారో బయటపడిపోతుందని.. భావిస్తున్నారు.