మూడు రాజధానులపై ఎంత వేగంగా ప్రభుత్వం అడుగులు వేసిందో.. అంతే వేగంగా ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. ఎవరు అడ్డుకున్నా.. మూడు రాజధానులు పెడతామని ఇప్పటికిప్పుడు వైసీపీ నేతలు ప్రకటిస్తున్నారు కానీ.. ఇప్పటికిప్పుడు మాత్రం.. వైజాగ్‌కు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను తీసుకెళ్లే చాన్సే లేకుండా పోయింది. కళ్లు మూసి తెరిచేంతలో అయిపోవాలన్నట్లుగా ప్రభుత్వం..గందరగోళంగా వ్యవహారాలు నడపడంతో.. రాజధాని తరలింపు అంశం మొత్తం పీట ముడి పడిపోయింది. ఈ చిక్కుముళ్లు విడిపోవడం అంత తేలిక కాదు. సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లు ఇప్పుడల్లా తిరిగి వచ్చే అవకాశం లేదు. మండలి రద్దవ్వాలంటే.. ఏడాదిన్నర వరకూ పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో.. న్యాయపరమైన అడ్డంకులు కూడా ఎదురయ్యాయి.
చట్టం చేయకుండా.. ఆఫీసుల్ని.. మౌఖిక ఆదేశాల ప్రకారం తరలిస్తే.. అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఆర్డినెన్స్. చట్టం కాలేదు కాబట్టి.. మండలిని ప్రోరోగ్ చేసి.. ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంది. కానీ..దీనికి కూడా న్యాయపరమైన ఎన్నో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. బిల్లు సెలక్ట్ కమిటీలో ఉన్నప్పుడు.. ఆర్డినెన్స్ తేకూడదని.. గతంలో ఉన్నత న్యాయస్థానం తీర్పులు చెప్పిందని.. అంటున్నారు. కోర్టులు కొట్టి వేస్తాయన్న భయమో… మరో కారణమో కానీ.. ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ప్రభుత్వ ముందు ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. అదే రాజ్యాంగానికి…చట్టాలకు సొంత భాష్యం చెప్పుకుని… పాలనా వ్యవహారాలను విశాఖకు తరలించడం.
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్.. ఈ విషయంలో.. అసెంబ్లీలో ఓ అడుగు ముందుకేశారు. తాను ఎక్కడి నుంచి పాలన చేస్తే.. అదే రాజధాని అని ప్రకటించారు. బహుశా.. ఈ ప్రకటనను అనుసరించి.. ఆయన వైజాగ్ వెళ్లిపోయి.. అధికారులందర్నీ అక్కడికే పలిపించి.. సమీక్షలు చేసి…పరిపాలన చేసే ఆప్షన్ మాత్రమే ఉంది. కానీ ఇలా చేస్తే.. పరిస్థితి మరింత దిగజారిపోతుంది. రాజ్యాంగ సంక్షోభానికి కారణయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ముందూ వెనుకాడుతున్నారని చెబుతున్నారు.