జగన్ నిన్న జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. బిజెపి తో కలిసి నడవడానికి తమకి ఎటువంటి అభ్యంతరాలు లేవనీ, కానీ బిజెపి ప్రత్యేక హోదా ఇస్తేనే వారితో తాము కలుస్తామని చెప్పాడు. పాద యాత్ర లో ఉన్న జగన్ ఉన్నట్టుండి జాతీయ మీడియా లో ప్రత్యక్షమవడం, ఇంటర్వ్యూ ఇవ్వడం, బిజెపి తో జతకట్టడానికి ఉత్సాహం చూపడం చాలా మంది ని ఆశ్చర్యపరచింది. అయితే అంతకన్నా ఆశ్చర్యపరిచిన విషయం ఇంకొకటుంది.
ప్రత్యేక హోదా ఇవ్వగలిగితే బిజెపి తో కలవడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని జగన్ చెప్పడం వరకూ బాగానే ఉంది. అంటే దీనర్థం, గతం లో మతతత్వ పార్టీ గా బిజెపి మీద ఉన్న ముద్ర వల్ల, దానితో జతకలిస్తే తమకి ఉన్న మైనారిటీ ఓటు బ్యాంక్ దెబ్బతింటుందన్న భయం జగన్ కి ఇప్పుడు లేదన్నమాట. పైగా ప్రత్యేక హోదా ఇస్తే బిజెపి మీద ఏర్పడే ఒక “హవా” ఖచ్చితంగా బిజెపి తో పాటు దానితో ఉన్న ఏ పార్టీకి అయినా మేలే చేస్తుంది.
అయితే ఇంటర్వ్యూ మొత్తం బిజెపి తో జతకట్టడానికి పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చిన జగన్, ఒక ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి, బహుశా కాస్త భిన్నంగా మాట్లాడాడు. బిజెపి, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలకి ఎపి లో బేస్ లేదని, అసలు వారికి ఉన్న ఓట్ షేర్ ఎంతని ప్రశ్నించాడు. ఈ ఇంటర్వ్యొ ద్వారా ఏమి సాధించాలని జగన్ అనుకున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. నిజంగా బిజెపి తో జతగట్టే ఉద్దేశ్యం ఉంటే, బిజెపి కి ఈ రాష్ట్రం లో “అంత సీన్ లేదు” లాంటి అభిప్రాయం వ్యక్తపరచి ఉండాల్సింది కాదు. ఒక వేళ బిజెపి కి “సీన్ లేదన్నదే” తన అభిప్రాయమైతే, ఆంగ్ల మీడియాకి వెళ్ళి మరీ హై కమాండ్ పెద్దలకి అర్థమయ్యేలా ఇంగ్లీష్ లో బిజెపి తో పొత్తు కి తన సంసిద్దత ని వ్యక్తపరచి ఉండకూడదు, అందులోనూ బిజెపి నుంచి అటువంటి పబ్లిక్ ప్రపోజల్ ఏదీ రానప్పుడు. మరి జగన్ ఏమి సాధించాలనుకుని ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడో చివరికి ఏమి సాధించాడో జగన్ కే తెలియాలి.