ఏపి రాష్ట్ర బడ్జెట్ 2016-17సం.లకి లో పంట రుణాల మాఫీ కోసం కేవలం రూ.3500 కోట్లు కేటాయించడంపై వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ రెండేళ్ళలో రుణాలపై వడ్డీయే సుమారు రూ.25, 000 కోట్లు ఉంటే, ప్రభుత్వం రుణమాఫీ కోసం కేవలం రూ.3500 కోట్లు కేటాయించడం రైతులను అపహాస్యం చేయడమేనని జగన్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనందునే అరకొర కేటాయింపులు జరిపిందని జగన్ విమర్శించారు. ప్రభుత్వం కేటాయించిన మొత్తంతో వడ్డీ కూడా చెల్లించలేనప్పుడు ఇంక అసలు ఎప్పుడు చెల్లిస్తుందని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే అరకొర కేటాయింపులు జరిపిందని ఆరోపించారు. బడ్జెట్ అంతా అంకెల గారడీ తప్ప రాష్ట్రానికి ఉపయోగపడేది ఏమీ అందులో లేదని విమర్శించారు. బడ్జెట్ లో గత ఏడాదికి సంబంధించిన వాస్తవ లెక్కలు చూపించకుండా దాచిపెట్టడం వలన పారదర్శకత లోపించిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
తెదేపా మంత్రులు, నేతలు జగన్ చేసిన ఆరోపణలను గట్టిగా ఖండించవచ్చును కానీ రుణమాఫీ విషయంలో బ్యాంకు లెక్కలు మారవు కదా? తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాని కోసం ఒక కమిటీ వేస్తే అది సుమారు ఆరు నెలలపాటు కసరత్తు చేసి దాదాపు లక్ష కోట్లకు పైగా ఉన్న పంట రుణాలను, సగానికి తగ్గించగలిగింది. ఈ 22నెలలో ప్రభుత్వం వాయిదాల పద్దతిలో దానిలో 50 శాతం పైగా తీర్చినట్లు చెప్పుకొంటోంది. కానీ కేటాయింపులు చూస్తే అది సాధ్యం కాదని అర్ధమవుతోంది. ఇంతవరకు ప్రభుత్వం రైతులకు చెల్లించిన దానిలో వడ్డీలకి కూడా సరిపోలేదని రైతులే చెపుతున్నారు. ఈ బడ్జెట్ లో కేటాయించిన రూ.3500 కోట్లతో అసలే చెల్లిస్తారా లేక వడ్డీలే చెల్లిస్తారా? అని జగన్ ప్రశ్నిస్తే తప్పు కాదు.