వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచీ… ఇప్పటివరకూ చాలా విషయాలు చెప్పినవే చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే..! వాటిలో ముఖ్యమైంది… ‘వ్యవస్థలో మార్పు’ అనే అంశంపై జగన్ చెబుతున్న మాట! ఈ వ్యవస్థలోకి నిజాయతీ రావాలంటారు, విశ్వసనీయత రావాలంటారు, అబద్ధాలూ పోవాలీ మోసాలు పోవాలి, ఈ వ్యవస్థలోకి ధర్మం రావాలనీ చెబుతుంటారు! ఇది జరగాలంటే మనందరం ఒకటి కావాలంటూ… అందరూ కలిసి పోరాటం చెయ్యాలంటారు. అంతిమంగా తనకు ఓట్లెయ్యడంలోనే ఆ ఐక్యతను ప్రదర్శించాలనే కోణంలో జగన్ మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో సాగుతున్న పాదయాత్ర సందర్భంగా కూడా ఇదే టాపిక్ మరోసారి మాట్లాడారు. దీంతోపాటు, మరో రొటీన్ టాపిక్… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డబ్బులిస్తే తీసుకోండని వ్యాఖ్యానించడం, ఇస్తానన్నవి చాలవని డిమాండ్ చెయ్యాలంటూ ప్రజలను కోరడం..!
ఓటుకి మూడువేల డబ్బు, ఇంటికి కేజీ బంగారం, బెంజికారు ఇస్తారంటే నమ్మతారా అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి జగన్ ప్రజలను ప్రశ్నించారు. ‘కానీ, ఓటు వేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు మూడువేలు డబ్బులిస్తే… వద్దు అనొద్దు. ఆయన మూడూ అంటే కుదరదూ ఐదు అనండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లోంచి దోచుకున్నదే. కానీ, ఎన్నికల రోజు ఓటేసేటప్పుడు మాత్రం.. మీ మనస్సాక్షి ప్రకారం ఓటెయ్యండి’ అని చెప్పారు. ఆ మనస్సాక్షి తానే అన్నట్టుగా తరువాత మాటలు ఉన్నాయి.
వ్యవస్థలో నిజాయతీ, నిబద్ధత, విశ్వసనీయ… ఇలాంటి చాలా లేవనీ, తేవాలని జగన్ అంటుంటారు కదా! అలాంటప్పుడు… ప్రజలను నీతికి విరుద్ధంగా, నిజాయతీకి వ్యతిరేకంగా, విశ్వసనీయతకు… ఓటుకు డబ్బు తీసుకోండని ఎలా ఎంకరేజ్ చేస్తారు..? డబ్బు తీసుకోకూడదనే విచక్షణ, విజ్ఞత లాంటిది ప్రజలకు ఉంటుంది కదా. ఈ వ్యాఖ్యల ద్వారా దాన్ని ప్రబావితం చేస్తున్నట్టుగా అనిపించడం లేదా? సరే, టీడీపీ ఇవ్వడానికి సిద్ధపడుతోందా అనేది వేరే చర్చ. అలాంటి ప్రయత్నమే జరిగితే దాన్ని ఎవ్వరూ వెనకేసుకుని రారు. చట్టప్రకారం చర్యలకీ ఆస్కారం లేకపోలేదు. ఫిర్యాదు చేసే హక్కు వైకాపాకి కూడా ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే… మూడు వేల రూపాయలు ఇస్తానని చంద్రబాబు అంటే, కాదూ చాలదూ.. ఐదు వేలు కావాలని డిమాండ్ చెయ్యాలని చెబుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది..? సరే, జగన్ ఆధారాలు చూపకుండా చేస్తున్న ఆరోపణల ప్రకారమే… ప్రజల సొమ్మే దోపిడీకి గురైందనుకుందాం కాసేపు. దాన్ని తిరిగి తీసుకోవాలంటే.. ఎన్నికల్లో ఓట్లకు ధర కట్టి వెనక్కి లాక్కోడమే పరిష్కారం అన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నారు. అంటే, వేరే మార్గాలు ఉండవా..? అధికార పార్టీది దోపిడీ అయితే.. దాన్ని తిప్పికొట్టడానికి మరోసారి అధికారం ఇవ్వొద్దని ప్రజలను కోరడం కొంత సమంజసంగా ఉంటుంది.