అప్పట్లో వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చారు! ఇప్పుడు అదే బాటలో ప్రతిపక్ష నేత జగన్ కూడా పాదయాత్రకు బయలుదేరుతున్నారు. అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేస్తున్నట్టు వైకాపా ప్లీనరీలో జగన్ ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ దాదాపు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నట్టు తెలిపారు. దాదాపుగా ఆర్నెల్లపాటు యాత్ర సాగిస్తూ, అందరినీ కలుసుకుంటానని తొమ్మిది హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తా అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ నవ సూత్రాలే తనని గట్టెక్కిస్తాయని జగన్ భావిస్తున్నారు. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఆర్థిక సాయం, డ్వాక్రా రుణాల రద్దు, పెన్షన్లను రూ. 2000లకు పెంచడం, అమ్మ ఒడి, పేదలకు 25 లక్షల పక్కా ఇళ్లు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులూ యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయడం… నిజానికి, ఎనిమిది హామీల్లో మరీ అంత కొత్తగా ఏమీ లేవు. కొన్ని ఇప్పటికే అమల్లో ఉన్నవి. ఉన్నంతలో ఈ హామీలు కాస్త ఫర్వాలేదనే చెప్పాలి. అయితే, ఈ క్రమంలో ఇచ్చిన తొమ్మిదో హామీ చర్చనీయాంశంగా మారుతుంది. అదే.. మద్య నిషేధం!
మూడు దశల్లో మద్య నిషేధం అమలు చేస్తామని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్లీనరీలో చెప్పారు. తొలిదశలో దుకాణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, బెల్టు షాపుల్ని తీసేయడం చేస్తామన్నారు. రెండో దశలో మద్యం ధరల్ని ఎవ్వరూ ఊహించని స్థాయికి పెంచేస్తామన్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు మద్యం కొనుగోలు చేయడమే కష్ట సాధ్యం అయ్యేలా చేస్తామని చెప్పారు. చివరి దశలో.. మద్యం విక్రయించినా కొనుగోలు చేసినా శిక్షలు అమలు చేస్తామన్నారు. మద్యం ఎవరైనా అమ్మినా, తయారు చేసినా ఏడేళ్లపాటు జైలు శిక్ష పడేలా చట్టం తెస్తామన్నారు. కేవలం స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తామని జగన్ చెప్పారు.
నిజానికి, ఇది చాలా మంచి హామీయే. అయితే, ఇదే హామీని గతంలో చాలాసార్లు చాలామంది నాయకులు ప్రజలకు ఇచ్చారు. మూణ్నాళ్ల ముచ్చటగా మద్య నిషేధాన్ని అమలు చేశారు కూడా! 1992-94 మధ్యలో మహిళలు మద్యంపై ఉద్యమించారు. సరిగ్గా ఆ తరుణంలోనే దశలవారీ మద్య నిషేధం అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అంటూ టీడీపీ కూడా ప్రకటించింది. తరువాత, టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే మాట నిలబెట్టుకుంటూ తొలి సంతకం మద్య నిషేధం ఫైల్ మీదే పెట్టారు. తరువాత, చంద్రబాబు సీఎం అయ్యారు. మద్య నిషేధం నెమ్మదిగా ఎత్తేశారు! ఆ తరువాత, ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా వైయస్ రాజశేఖర రెడ్డి కూడా నాటి పాదయాత్రలో మద్య నిషేధ హామీ ఇచ్చారు. తరువాత ఆ టాపిక్ టచ్ చెయ్యలేదు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ ఇచ్చిన హామీల్లో మద్య నిషేధాంశం కూడా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ‘మద్య నిషేధం’ అనేది ఎన్నికల్లో ప్రభావంతమైన హామీగా నిలిచిన చరిత్ర ఉంది. అదే సమయంలో దాన్ని సమర్థంగా అమలు చేయలేకపోయిన అసమర్థ పాలకుల నిర్వాకపు చరిత్ర కూడా ఉంది! ఎన్నికలు వచ్చినప్పుడు మద్య నిషేధం హామీకి ఎట్రాక్ట్ కావడం… తరువాత, అమలు చేయలేని ప్రభుత్వాల పనితీరుకు నివ్వెరపోవడం ప్రజలకు అలవాటైపోయింది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే.. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు మద్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమంత ఆశాజనకంగా ఉండటం లేదు. ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్టులకు వెళ్తోంది. జీఎస్డీపీ వృద్ధి అద్భుతః అని గొప్పగా చెప్పుకుంటున్నా.. సర్కారు వారి అప్పులు తడిసి మోపెడు అవుతున్నాయి. 2019 తరువాత కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు! అయితే, ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా మద్య నిషేధం అమలు చేయడం అసాధ్యమని ఎవ్వరూ చెప్పరు! చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే. కానీ, మద్య నిషేధం హమీని జగన్ సుసాధ్యం చేస్తారు అని ప్రజలు ఎంత బలంగా నమ్ముతారు అనేదే అసలు ప్రశ్న..?