ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో సాగుతోంది. అనపర్తి నియోజక వర్గ పరిధిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు. నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదనీ, ఇలా మోసం చేసే నాయకుడు, అబద్ధాలు చెప్పే నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రజలను అడుగుతావున్నా అన్నారు జగన్! చంద్రబాబు పాలనతో రైతులకు ఒక్క పంటకైనా మద్దతు ధర వచ్చిందా అని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చిన భూములను లాక్కునే కార్యక్రమాన్ని టీడీపీ నేతలు అన్నిచోట్లా చేస్తున్నారని విమర్శించారు.
ఇక, మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి కూడా కొన్ని విమర్శలు చేశారు. అనపర్తి నియోజక వర్గంలో ప్రభుత్వం విధించే పనులతోపాటు… తెలుగుదేశం ట్యాక్స్ అనేది కూడా ఒకటి ఉందని ప్రజలు తనతో చెప్తున్నారని జగన్ అన్నారు. అనపర్తి నియోజక వర్గ పరిధిలో ఎవరైనా కొత్త లేఅవుట్లు వేస్తే, వాటి అనుమతుల కోసం లంచాలు ఇవ్వాల్సిందేననీ, అవి నేరుగా చినబాబు దగ్గరకి వెళ్తున్నాయని ఆరోపించారు. మిల్లర్లు ప్రతీదానికీ లంచాలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. స్థానికంగా ప్రతీ పనికీ తెలుగుదేశం ట్యాక్స్ వసూలు చేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేకి అప్పగించారని ఆరోపించారు. వసూళ్లు చేస్తున్న లంచాలు ముందుగా కలెక్టర్లకు చేరుతాయనీ, ఆ తరువాత నేరుగా చినబాబుకే అందుతాయని ఆరోపించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతీ మద్యం షాపు నుంచీ నేరుగా లక్షలు వెళ్తున్నాయని అన్నారు. ఇక, ఇతర విమర్శలు షరా మామూలే. ప్రతీచోటా చేస్తున్నవే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగానీ, ఆయన కుమారుడు నారా లోకేష్ గానీ ఇంత నేరుగా లంచాలు తీసుకుంటున్నారని తెలిస్తే… ఆధారాలతో బయటపెట్టొచ్చు కదా! సొమ్ము ఎక్కడి నుంచి వసూలై ఎలా వెళ్తున్నాయో, ఎంత వ్యవస్థీకృతంగా ఉన్నాయో వైకాపాకి తెలిస్తే… వారి సొంత మీడియా సంస్థ ద్వారా వాటిని బట్టబయలు చెయ్యొచ్చు కదా! ప్రతీసారీ ఎవరో చెప్పారనీ, తాను పాదయాత్రలో నడుచుకుంటూ వెళ్తుంటే.. ఎవరో వచ్చి కలిసి వివరించారనీ చెప్పడమెందుకు..? టీడీపీ పాలనలో జగన్ కి కనిపించే అవినీతి మొత్తాన్ని ఆధారాలతో సహా ప్రజముందుంచితే బాగుంటుంది! ప్రజలకు కూడా వాస్తవాలు తెలుస్తాయి.
ఆధారాలు లేకుండా ఎన్నాళ్లు మాట్లాడినా ఇలాంటి ఆరోపణపై ప్రజల్లో ఒక స్థాయి నిరాసక్తత వచ్చేస్తుంది. వారు గుర్తిస్తున్నారో లేదో తెలీదుగానీ… ఇప్పటికే అది మొదలైంది..! ఎందుకంటే, ప్రతిపక్ష నేత జగన్ మొదలుకొని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గానీ, కొత్తగా భాజపా నేతలుగానీ.. అందరూ ఆంధ్రాలో టీడీపీ పాలన అవినీతిమయమనే మాట్లాడుతున్నారు. కానీ, ఎవ్వరూ ఆధారాలతో ఆరోపణలు చేయడం లేదు..!