తెలంగాణాలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణాలని వ్యతిరేకిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కర్నూలులో మూడు రోజులు నిరాహార దీక్షలు చేశారు. తెలంగాణాలో ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులను వైకాపా నేతల సంస్థలే చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించినప్పుడు వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గట్టిగా ఖండించారు. తమ సంస్థ దేశవిదేశాలలో పనులు చేయడం మాట వాస్తవమే కానీ తెలంగాణాలో మాత్రం ఒక్క పని కూడా చేయడం లేదని వాదించారు. కానీ తెదేపా నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణాలో పాలమూరు ప్రాజెక్టు నిర్మాణపనులు వైకాపా నేతలకి చెందిన సంస్థలే చేస్తుంటే, వారి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఆ విషయంపై జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు జవాబు చెప్పకుండా తప్పించుకొన్నారు. కానీ నిన్న అనంతపురంలో రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నపుడు ఒక విలేఖరి ఇదే విషయం గురించి ప్రశ్నించినపుడు జగన్మోహన్ రెడ్డి నిజం బయటపెట్టారు. “అవును. సిపిఐతో బాటు అన్ని పార్టీలలో కాంట్రాక్టర్లు ఉన్నారు. నేను ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకిస్తున్నానంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినట్లే కదా? నేను ప్రాజెక్టులు అడ్డుకొంటున్నానంటే వాళ్ళకు నష్టమే జరుగుతుంది కదా? పదిమందికి మేలు జరగడం కోసం ఒకరికి నష్టం వస్తుందని వెనకడుగు వేయకూడదు,” అని అన్నారు. (ఇది సాక్షి పత్రిక శుక్రవారం ఎడిషన్ లో ప్రచురించబడింది.)
అంటే మా పార్టీ నేతలు తెలంగాణాలో ప్రాజెక్టులు కడుతుంటారు. ఇక్కడ వాటిని నేను వ్యతిరేకిస్తాను. వాళ్ళు ఆ కాంట్రాక్టులు వదులుకొంటారో లేదో నాకు అనవసరం. దేని దారి దానిదే! అని జగన్ చెపుతున్నట్లుంది. ఇది జగన్ ద్వంద వైఖరికి అద్దం పడుతోంది. ఈ ద్వంద వైఖరి కేవలం ఆయనకే పరిమితం కాలేదు. తెలంగాణా ప్రాజెక్టులను అయన వ్యతిరేకిస్తున్నప్పుడు, తెలంగాణాలో వైకాపా నేతలు కూడా నోరు మెదపరు. ఎందుకంటే, వాళ్ళూ వ్యతిరేకిస్తే తెలంగాణాలో ప్రజలు తరిమికొడతారు. ప్రాజెక్టులకి అనుకూలంగా మాట్లాడితే ఏపిలో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే వాళ్ళూ మౌనం వహిస్తారు. సాక్షి మీడియాది కూడా అదే తీరు. జగన్ దీక్ష చేస్తున్నంత కాలం ఆ ప్రాజెక్టుల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద అరిష్టం కలుగబోతోందన్నట్లు కధనాలు ప్రచురిస్తుంది. తెలంగాణా సాక్షిలో ఆ ప్రాజెక్టు పురోగతి గురించి వివరాలు ప్రచురిస్తుంటుంది. ఇదీ వైకాపా తీరు!