ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో అమలు చేయనున్న సంక్షేమ పథకాలను.. పకడ్బందీగా ప్రజలకు చేరేలా.. ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న ఆయన… వీరి సేవలను లాంఛనంగా.. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించనున్నారు. పథకాల అమలుకు ఓ ప్రత్యేకమైన క్యాలెండర్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను ప్రకటించారు. ఈనెల 15న గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప్రారంభించారు. వాలంటీర్లు అందరూ.. పరిస్థితులపై అవగాహన తెచ్చుకున్న తర్వాత ఈనెల 26-30 తేదీల మధ్య ఇళ్ల పట్టాలు లేని వారి కోసం సర్వే నిర్వహిస్తారు. అందరి వివరాలు సేకరిస్తారు.
సెప్టెంబర్ 1నుంచి శ్రీకాకుళంలో నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేస్తారు. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. శ్రీకాకుళంలో వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్రమంతా అమలు చేస్తారు. అలాగే.. రాష్ట్రమంతటా.. సెప్టెంబర్ 1నుంచి 10వరకు పెన్షన్ డోర్ డెలివరీ చేస్తారు. వృద్ధులు ఇక పెన్షన్ కోసం పడిగాపులు పడాల్సిన పని లేకుండా.. గ్రామ వలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారు. పదో తేదీ లోపు పెన్షన్ల పంపిణీని పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 11 నుంచి 15వరకు కొత్త పెన్షన్లు, రేషన్‌కార్డులు జారీ చేస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 30వరకు పథకాల అమలు ఎలా జరిగిందనేదానిపై…ప్రభుత్వం సమీక్ష చేస్తుంది.
వాలంటీర్ల వ్యవస్థలో మెరుగుపరచాల్సిన అంశాలపై సమీక్షిస్తారు. అలాగే.. అక్టోబరు 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని జగన్ నిర్ణయంచారు. రైతు భరోసా పథకం ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. 11 నెలల కాలానికి గ్రామ సచివాలయం నుంచి కౌలురైతులకు కార్డులు అందిస్తారు. కౌలు రైతులకు కార్డులు అందగానే వారందరికీ రైతు భరోసా కింద నగదు అందిస్తారు. వచ్చే ఏడాది నుంచి రైతు భరోసాను మేలోనే అందిస్తామని జగన్ ప్రకటించారు. పథకాల అమలు పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత సెప్టెంబర్ నుంచి జిల్లాల్లో పర్యటించాలని జగన్ నిర్ణయించుకున్నారు.