“ రాజకీయాల్లో ఎలాంటి హోదాలు వచ్చినా, సంపాదించుకున్నా అది ప్రజలు ఇచ్చేవే. ప్రజలతో సంబంధం లేకుండా ఏదీ రాదు”. ఈ విషయం రాజకీయ నేతలు అందరికీ తెలుసు. కానీ కొంత మంది విపరీత వ్యక్తులు ఉంటారు. తనకు హోదా జన్మహక్కు అనుకుంటూ ఉంటారు. తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూంటారు. లేకపోతే ప్రజలు ఇచ్చిన బాధ్యతల్ని కూడా నిర్వర్తించనని అలుగుతూంటారు . ఇలాంటి రాజకీయ నేతల్ని చూసి నవ్వావో.. ఏడవాలో ఆయనకు ఓటు వేసిన వారే ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు. ఏపీలో ఇప్పుడు అదే జరుగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అలిగి అసెంబ్లీకి రావడం మానేశారు. హోదా ఉంటేనే తనకు సీఎంతో సమానంగా మాట్లాడే అవకాశం వస్తుందని.. అలా అయితేనే తనకు ప్రోటోకాల్ వస్తుందని అలాంటి ప్రోటోకాల్ ఉంటేనే తాను సభకు వస్తానని మంకుపట్టు పడుతున్నారు. తనకు హోదా ఇవ్వాల్సిందే అని హైకోర్టులో పిటిషన్ వేశారు. చేయాల్సినంత రచ్చ చేస్తున్నారు. ఆయన పోరాటం వచ్చే ఐదు సంవత్సరాలూ కొనసాగేలా ఉంది. అందుకే హోదా యోథ అని పాత బోర్డును తీసి ఆయన ఇంటికి తగిలిస్తున్నారు ఫ్యాన్స్. ఆయన పేరు ముందు చేరుస్తున్నారు.. హోదా యోధ జగన్ అని అంటున్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లుగా ఫేక్ పోరాటాలు చేశారు. ఆ పోరాటాలకు మెచ్చి ఆయన అభిమానులు, సోషల్ మీడియా కార్యకర్తలు హోదా యోధ అనే బిరుదు ఇచ్చారు. ఆ యోధుడు.. కేంద్రంలో ఎల్లయ్య, పుల్లయ్య ఉన్నా సరే తాను మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకు వస్తానని చాలెంజ్ చేశారు. అబ్బో ఇంత పెద్ద యోధుడా అనుకుని జనం ఓట్లేశారు. ఐదు సంవత్సరాల పాటు ఆయన .. ప్రత్యేకహోదా అడిగిందిలేదు.. పెట్టిందిలేదు. అందుకే ఆ బిరుదు నిర్వీర్యం అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ వాడుకునే అవకాశం ప్రజలు ఇచ్చారు. ప్రత్యేకహోదా కోసం పెట్టుకున్న హోదా యోధ బిరుదు ఎలాగూ పనికి రాలేదు కాబట్టి.. కనీసం వ్యక్తిగత హోదా అయినా తెచ్చుకో అని ప్రజలు ఈ టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు ఇదే టాస్క్. తనకు ప్రతిపక్ష హోదాను సాధించడమే జగన్ మోహన్ రెడ్డికి ముందున్న టాస్క్. అందుకే హోదా యోధగా మారి తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. నాడు రాష్ట్రం కోసం అని చెప్పుకున్నారు.. నేడు తన కోసం అని చెప్పుకోవాల్సిన స్థితికి పడిపోయారు. ఓ రాజకీయ నాయకుడి పతనం ఇంత విజిబుల్గా ఉండటం ఇటీవలి కాలంలో ఇదే పతనం.
ప్రజలివ్వని హోదా కోసం పోరాడుతున్న హోదా యోధ
మాట్లాడితే నలభై శాతం ఓట్లు వచ్చాయని చెబుతూ జగన్ మోహన్ రెడ్డి స్వయం తృప్తి పొందుతూ ఉంటారు. నిజానికి ఆయనకు వచ్చిన ఓట్ల పర్సంటేజీ నలభై శాతం తాకలేదు. 39 శాతానికి అటూ ఇటూ గానే ఉన్నాయి. కానీ తన వరకూ వస్తే రౌండ్ ఫిగర్ చేసేసుకుంటారు. అదే తన పథకాల అమలు శాతం గురించి చెప్పమంటే 99.97 శాతం అంటారు. ఇదేం లెక్కో ఎవరికీ అర్థం కాదు. కానీ అంత ఖచ్చితంగా చెబుతున్నాడంటే.. లెక్కలేసుకుని వచ్చి ఉంటాడని పిచ్చి జనం నమ్ముతారని ఆయన అనుకుంటారు. ఐదు సంవత్సరాల పాటు చేసిన ఇలాంటి గారడీల కారణంగానే ఆయనకు ఎలాంటి హోదా ఇవ్వాలో ప్రజలు అలాంటి హోదా ఇచ్చారు. భారత ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ.. ఆ పార్టీతో కలిసి పోటీ చేసిన పార్టీలు తప్ప.. మిగతా అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీలే. కానీ కనీసం పది శాతం సీట్లు ఉన్న. పార్టీకే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే హోదా లభిస్తుంది. ఆ ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదాతో పాటు కొంత ప్రోటోకాల్ లభిస్తుంది. ఆ పది శాతం సీట్లను కూడా సాధించుకోలేని పార్టీ కూడా ప్రతిపక్షమే. కానీ అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్షం అనే గుర్తింపు మాత్రమే ఇవ్వదు. దాని వల్ల ప్రోటోకాల్ మాత్రమే రాదు. కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్. కానీ ఈ జగన్ రెడ్డి తనకు ప్రోటోకాల్ కోసమే ఈ హోదా కోసం పోరాడుతున్నారు. ప్రజల కోసం పోరాడటానికే ఈ హోదా కావాలంటూ ఆయన మాటలు చెబుతున్నారు. ప్రశ్నించడానికి కూడా హోదా కావాలని లేకపోతే అసలు అసెంబ్లీకే రానని అంటున్న ఆయన తీరు .. నిజంగా రాజకీయ నాయకుడు అనిపించుకోవాలని అనుకునేవాళ్లకు చాలా పాఠాలు నేర్పుతాయి. జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా అసెంబ్లీలో వైసీపీ తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేదు. నిజమే ప్రతిపక్షం కాదని ఎవరూ అనడం లేదు. వైసీపీ వాళ్లే అంటున్నారు. తాము బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటున్నాం కాబట్టి తాము కూడా అధికూడా అధికార పక్షం అని ప్రజలు అనుకుంటారేమోనని.. తాము ప్రతిపక్షం అని అధికారికంగా ధృవీకరిస్తే.. మొహం మీద ముద్ర వేయించుకుని తిరుగుతామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అనేది ప్రతిపక్షమే. కాదని ఎవరన్నారు.
అసెంబ్లీకి వెళ్లడానికి భయం అసలు కారణం !
అసెంబ్లీకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎంత మంది సభ్యులు ఉంటే ఆ ప్రకారం సమయం కేటాయిస్తారు. ఉన్న సభ్యులకూ సమయం కేటాయించని దౌర్భాగ్యమైన రాజకీయంతో సభను నడిపించిన జగనే ఇప్పుడు తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే హక్కులు వస్తాయని వాదిస్తున్న వైఖరి చూసి విస్మయం చెందడం వైసీపీ నేతలకు ఉంటుంది. ఐదు సంవత్సరాల పాటు ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది ?. టీడీపీకి ఉన్న 23 మంది సభ్యుల్లో నలుగురిని లాగేసుకున్నారు. రాజీనామా చేయించే తీసుకుంటానని చేసిన అసెంబ్లీలో చెప్పి మాటతప్పారు. చంద్రబాబు ప్రతిపక్ష హోదాను తీసేయడానికి చేయని ప్రయత్నం లేదు. మరో నలుగురు, ఐదుగుర్ని లాగేస్తే ఇంటి ముందు ఉన్న పోలీస్ సెంట్రీ పోస్టు కూడా తీసేస్తామని కొడాలి నాని అనే పేరు మోసిన రాజకీయ నేత ప్రకటించారు. స్వయంగా జగన్ కూడా.. అదే చెప్పారు. మరో నలుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే .. ప్రతిపక్ష హోదా ఉండదన్నారు. ఇప్పుడు ప్రజలే ఆ ప్రతిపక్ష నేత హోదా అనేది లేకుండా జగన్కు పీకేశారు. అయినా ప్రజాభిప్రాయాన్ని ఆయన గౌరవించడం లేదు. ప్రజలకే తెలియదని.. తనకు నలభై శాతం ఓట్లేశారన్న వితండవాదనతో తెరపైకి వచ్చి నాట్యమాడుతున్నారు. చంద్రబాబుకో రాజ్యాంగం.. జగన్ కో రాజ్యాంగం ఉండదని వైసీపీ నేతలకూ తెలుసు. అందుకే ఆయన పిచ్చిని భరంచగలిగేవాళ్లే పక్కన ఉంటున్నారు. మిగతా అంతా సైలెంటుగా ఉంటున్నారు.
జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడానికి కారణం ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం..రాకపోవడం కాదు. సభలో మొహం చూపించలేకపోవడమే. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు సభా నేతగా ఉన్నప్పుడు .. అసెంబ్లీలో చేసిన, చేయించిన వికృత కార్యాలు ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు అలాంటివి రివర్స్ చేస్తే తన పరువు పోతుందని ఆయన రావడం లేదు. అసెంబ్లీని ఓ కౌరవసభగా మార్చిన ఘనత ఆయనది. ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీలో ఆయన కొంత మంది రౌడీ ఎమ్మెల్యేలతో చేయించిన ఘన కార్యాలు, నిర్వాకాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చివరికి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు కుటుంబాన్ని, ఆయన భార్యపై కూడా నిందలు వేసిన ఓ దౌర్భాగ్యమైన కౌరవసభను నడిపించారు. ఓ ఎమ్మెల్యే జిప్పు తీస్తాడు. మరో మంత్రి ఎమ్మెల్యేలపై దాడి చేస్తాడు. మండలిలో మంత్రులు.. పోడియం కాదు.. అసలు చైర్మన్ టేబుల్ పైకి లారీ పైకి ఎక్కినట్లుగా ఎక్కుతారు. వైసీపీ ఎమ్మెల్యేలు .. ప్రతిపక్ష నేతలపై వ్యవహరించిన తీరును ఎవరూ మర్చిపోరు. బయటకు వచ్చిన వీడియోలు చాలా తక్కువ. రికార్డుల్లో కూడా ఉంచకుండా.. తీసేసినవి చాలా ఎక్కువ. తాము అలా చేశాం కాబట్టి తమను అంత కంటే ఎక్కువగా చేస్తారన్న భయంతోనే ఆయన అసెంబ్లీకి వెళ్లడం లేదన్నది అసలు నిజం. ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై ఏ మాత్రం నమ్మకం లేని జగన్ ప్రతిపక్ష పార్టీని ఎలా వేధించాలో అలా వేధించి ఇప్పుడు ప్లేస్ రివర్స్ అయ్యే సరికి భయపడి పారిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కుప్పంలో.. అడ్డగోలుగా ఎన్నికలు నిర్వహించి గెలిచి వచ్చిన తర్వాత.. చంద్రబాబు అసెంబ్లీ వస్తే.. ఏది.. చంద్రబాబు మొహం ఓ సారి చూడాలనుందని వెటకారం చేశాడు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవ్యక్తి. అలాంటి మనస్థత్వం ఉన్న వ్యక్తి ఇవాళ తాను ఓడిపోతే.. ఎమ్మెల్యేగా అయినా ప్రజలు గెలిపించినందుకు సంతోషపడి అసెంబ్లీకి వచ్చి.. ప్రజల కోసం పోరాడాలి కదా. తాను అసెంబ్లీలో మంచే చేశానని.. పద్దతి ప్రకారమే చేశానని అనుకుంటే భయం ఎందుకు ?.
ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని యోధులకు రాజకీయ భవిష్యత్ ఉండదు !
జగన్ కు ప్రజాస్వామ్య విలువలపై ఎప్పుడూ నమ్మకం లేదు. గతంలో పాదయాత్ర కోసం అసెంబ్లీని బహిష్కరించారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేలను పోనివ్వలేదు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలను పోనివ్వడం లేదు. ఆయనకు హోదా రాకపోతే ఎమ్మెల్యేలు తమ హక్కులను ఎందుకు కాల రాసుకోవాలో వారికీ తెలియదు. కానీ తనను కాదని వారు అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ అడ్డుకుంటున్నారు. అందరి అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు అవుతాయన్న భయంతో ఒక్క రోజు వెళ్లి హాజరు వేయించుకుని గవర్నర్ ను అవమానించి వచ్చారు. కానీ ఇలాంటి తెలివి తేటలు ఆయనకు ఒక్కరికే ఉంటాయనుకోవడం ఎంత అమాయకత్వం. అది జగన్ సొంతం. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ప్రజలే ఇవ్వలేదన్నది నిజం. రాహుల్ గాంధీ .. కాంగ్రెస్ పార్టీ దేశంలో పదేళ్ల పాటు ప్రతిపక్ష హోదాలో లేదు. కేవలం ప్రతిపక్షంగా ఉంది. అధికారిక హోదా లోక్ సభ ఇవ్వలేదు. ఎందుకంటే దానికి కావాల్సిన 54 ఎంపీ సీట్లను రెండు ఎన్నికల్లో గెల్చుకోలేదు. ఇప్పుడు గెల్చుకుంది కాబట్టి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయ్యారు. పది శాతం సీట్లు లేని ఏ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష ఏ రాష్ట్రంలోనూ ఇవ్వరు.. ఇవ్వడం లేదు. కోర్టులు కూడా అదే చెప్పాయి. అయినా అసెంబ్లీకి వెళ్లడానికి భయంతో ఓ కారణం పెట్టుకుని హోదాయోధుడి అవతారం ఎత్తారు.
నాడు రాష్ట్రం కోసం హోదా యోధుడి అవతారం ఎత్తారు.. ఇవాళ ప్రజలు ఇవ్వని హోదా కోసం యోధుడిగా మారారు. ఈ పతనం ఐదేళ్లలోనే సాగింది. ఈ విషయాన్ని ఆయన కానీ.. ఆయన ఇంకా అనుసరిస్తున్నవారు కానీ అర్థం చేసుకుంటే.. వారి రాజకీయానికి ఇంతటితో ముగింపు లభిస్తుంది.