ఎన్నికలకు ముందే జగన్ రెడ్డి చేతలెత్తేశారు. తన చేతుల్లో ఏమీ లేదని ఇక మీదేనని బూత్ కమిటీల పేరుతో పిలుచుకు వచ్చిన రెండు వేల మందిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. లేనిపోని ధైర్యాన్ని తెచ్చుకుని.. తాను ఓ పెద్ద ఆయుధాన్ని ఇచ్చానని.. ఏ నాయకుడూ తన క్యాడర్‌కు అలాంటి ఆయుధం ఇవ్వలేదన్నారు. ఆ ఆయుధం ఏమిటో మాత్రం జగన్ రెడ్డి చెప్పలేదు. బహుశా.. బటన్లు నొక్కినా డబ్బులు పడని పరిస్థితే పెద్ద ఆయుధం అనుకున్నారేమో కానీ.. జగన్ రెడ్డి ప్రసంగం విని బూత్ కమిటీల నాయకులకు మైండ్ బ్లాంక్ అయింది.
ఇప్పటికే వాలంటీర్లకు పూర్తి బాధ్యతలిచ్చారు. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు బూత్ కమిటీల గురించి జగన్ రెడ్డి కి గుర్తుకు వచ్చింది. పాత బూత్ కమిటీల్లో చెల్లా చెదురైపోగా.. మిగిలిన కొంత మందిని పిలిపించుకున్నారు. తాను అంతా చేసేశాని.. ఇక మీ చేతుల్లోనే ఉందని దీనంగా చెప్పేశారు. అందరికీ మంచి చేశానని .. తన రొటీన్ ప్రసంగాన్ని కూడా చదివి వినిపించారు. అభ్యర్థులను ఇక మార్చడం లేదని.. మార్చాలనుకున్న వాళ్లని మార్చేశానని 99 శాతం మంది ఇంచార్జులే అభ్యర్థులుగా ఉంటారని చెప్పుకొచ్చారు.
బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చెయ్యాలి. సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించాల తమ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు ఐదుసార్లు కలవాలని సూచించారు. ఇప్పటివరకు నేను పని చేశాను, ఇక నుంచి పూర్తిగా మీరే పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వైసీపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి ఇప్పటి వరకూ ఏం పని చేశారో.. ఆయనకే తెలియాల్సి ఉంది.
ఈ సమావేశంలో బూత్ కమిటీలను బలోపేతం చేయడంపై వైసీపీ శ్రేణులకు ఐప్యాక్ టీం ప్రజెంటేషన్ ఇచ్చారు. మార్చి 15లోపు బూత్ కమిటీలను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాలని రూట్ మ్యాప్ ఇచ్చారు.