ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారికి ప్రధాన బాధ్యత ప్రజల బాగోగులు చూసుకోవడం. తాను ఓ ప్యాలెస్ నిర్మిచుకుని చుట్టూ ఇనుప పరదాలు కట్టేసుకుని లోపల వందిమాగధులతో ఏదేదో చేస్తూ టైం పాస్ చేసుకోవడం కాదు. కానీ ఏపీ సీఎం జగన్ రెడ్డి అదే చేస్తున్నారు. వివిధ వర్గాలు రోడ్డెక్కితే… కనీసం పట్టించుకోకుండా.. రోమ్ తగలబడుతూటే రాజు ఫిడేల్ వాయించుకున్న చందంగా.. ప్రజలంతా ఇబ్బందులు పడుతూంటే.. ఆయన మాత్రం… తన సొంత పార్టీ నేతల రాజకీయ భవిష్యత్ తో ఆటలాడుతూ… వారు టెన్షన్ పడుతూంటే… తెగ సంతోషపడుతున్నారు.
ప్రజల బాధలు చూస్తే జగన్ రెడ్డికి ఆనందమా
అంగన్వాడి టీచర్లు రోడ్డెక్కి నెల దాటిపోయింది. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఎస్మా అని వారిపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. వారు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఇక వారిపై పోలీసులు విరుచుకుపడటమే మిగిలింది. వారిని చితక్కొట్టి జళ్లోల వేస్తామని చెబుతున్నారు. వాళ్లు ఓట్లేస్తే గెలిచిన సీఎం అలా చేస్తే… ఓట్లేసిన వారికి.. వచ్చే రెండు నెలల్లో ఓట్లేసే ఆయుధం వారి చేతుల్లో ఉన్నప్పుడు వారెందుకు వెనక్కి తగ్గుతారు ?. ఒక్క అంగన్వాడిలు కూడా ప్రభుత్వ చేతకాని తనానికి ప్రతీకగా దాదాపుగా ప్రతి వర్గం రోడ్లపై నిరసనలు చేస్తూనే ఉంది. మున్సిపల్ కార్మికుల దగ్గరనుంచి 104 సిబ్బంది వరకూ ఈ సమ్మెలు చేస్తున్నారు. కానీ సీఎం మాత్రం ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదు.
ఏం జరుగుతుందో కనీసం పట్టించుకోని సీఎం – ఏపీ ఖర్మ
అధికారంలోకి రావడానికి ఇచ్చిన వందల హామీలను అమలు చేయమని అందరూ రోడ్డెక్కితే…కనీసం ఏం జరుగుతుందో కూడా ఒక్క సారి కూడా సమీక్ష చేయని సీఎం… రాజ్యాంగేతకర శక్తి అయిన సజ్జల రామకృష్ణారెడ్డితో మాత్రం… రాజకీయ ప్రకటనలు చేయిస్తూ ఉంటారు.లఅంగన్వాడిల సమ్మె వెనుక టీడీపీ ఉందని చెప్పి .. తమను తాము మోసం చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఓ రాజకీయ పార్టీ మద్దతుతో జరిగే ధర్నాలకు… కడుపు మండి చేసే ధర్నాలకు చాలా తేడా ఉంటుంది. ఆ తేడా.. జగన్ రెడ్డికి బాగా తెలుసు. కానీ తెలియనట్లుగా ఉంటున్నారు.
కనీస బాధ్యత తెలియని సీఎం
ముఖ్యమంత్రి అంటే అప్పులు తెచ్చి.. ఆస్తులు అమ్మి బటన్ నక్కడమే అన్నట్లుగా ఉంది జగన్ రెడ్డి వ్యవహారశైలి. మరి ఇంకే సమస్య కూడా పట్టదని ఆయన అంటున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీని నెరవేర్చకుండా 99.5 శాతం అంటూ సొల్లు కబుర్లు చెబుతారు. కానీ.. పది శాతం కూడా అమలు చేయలేదనేది నిజం. అయినా అకౌంట్లలో పదివేలు వేస్తే.. ఇలా ధర్నాలు చేసే వాళ్లు కూడా పరుగులు పెట్టి ఓట్లేస్తారని ఆయన నమ్మకం. అందుకే ఇంత దిలాసా.