సాధారణం కోర్టుల్లో స్టే వస్తే.. ఆ పని ముందుకు వెళ్లడానికి అవకాశం ఉండదు. మళ్లీ కోర్టు స్టే ఎత్తేయాలని. కానీ.. ఏపీ సర్కార్ మాత్రం.. ఆ స్టేపై… డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేసి… పనులను ముందుకు తీసుకెళ్లిపోతోంది. కోర్టుల ఆదేశాలకు..కొత్త భాష్యం చెబుతోంది. పోలవరం రివర్స్ టెండర్లపై ముందుకెళ్లవద్దని… హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైడల్ విద్యుత్ కేంద్రం విషయంలో నవయుగకు ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీనిపై… ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేసింది. ఇంకా.. విచారణ ప్రారంభం కాలేదు. అయినప్పటికీ.. కోర్టు… స్టేను ఎత్తేసినట్లుగా భావించి .. టెండర్లను పిలిచేసింది.
పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రూ.4,987.55 కోట్ల అంచనా విలువతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం జగన్ సర్కార్ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో టెండర్ డాక్యుమెంట్‌ను అప్లోడ్ చేసింది. గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచే డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 20వతేదీ ఉదయం 11 గంటల వరకు బిడ్ దాఖలు చేసుకోవచ్చని.. ప్రభుత్వం టెండర్ డాక్యుమెంట్లో తెలిపింది. రివర్స్ టెండర్లపై ముందుకు వెళ్లవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ.. టెండర్ షెడ్యూల్‌ను అప్లోడ్ చేశారు.
హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకునే వరకూ ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయదని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం.. మాత్రం.. కోర్టు తీర్పును లైట్ తీసుకుంది. కేబినెట్లో కూడా.. దీనిపై నిర్ణయం తీసుకున్నారు. టెండర్ నోటిఫికేషన్ ను ఆగస్టు 17వ తేదీనే జారీ చేశారు. కానీ కోర్టు కేసు కారణంగా అప్ లోడ్ చేయలేదు. సీఎం జగన్ విదేశాల్లో ఉండటంతో.. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. టెండర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని .. ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే హైకోర్టులో స్టేపై ఎలాంటి రిలీఫ్ లేకుండా… కోర్టు ఉత్తర్వులు ధిక్కరించేలా…ప్రభుత్వం వ్యవహరించడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.