వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్‌లో భూములు తెగనమ్మి అమలు చేసిన సంక్షేమ పథకాల… పథకాన్ని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి..ఈ సారి ఏపీలో అమలు చేయబోతున్నారు. నవరత్నాల పేరుతో.. అలవి కాని హామీలు ఇచ్చిన ఆయన.. వాటిని అమలు చేయడానికి వచ్చే సరికి.. తలకు మించిన భారంగా కనిపిస్తోంది. ఆదాయం పడిపోయింది. అప్పులు పుట్టే పరిస్థితి లేదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రభుత్వంపై నమ్మకం కలగడం లేదు. ఈ క్రమంలో.. భూములు అమ్మకం అనే.. కీలకమైన చిట్కాను.. తన తండ్రి పాలనను నుంచి గ్రహించారు. వెంటనే కేబినెట్ సమావేశంలో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతోనే.. భూముల్ని అమ్ముతామంటూ… బయలుదేరారు.
ఏదైనా కుక్కును చంపే ముందు దానికి పిచ్చిదనే ముద్రవేయాలి. అందుకే.. చాలా వరకూ ప్రభుత్వ శాఖల అధీనంలో ఉన్న భూములన్నీ… పరాధీనమయ్యాయని.. మరొకటని కారణం చెబుతున్నారు. కానీ.. అసలు లక్ష్యం మాత్రం… నగదు పంపిణీ పథకాలకు డబ్బులు సేకరించడమే. ఇప్పటికే ఓవర్ డ్రాఫ్ట్‌ల మీద నడుస్తున్న సర్కార్ కు.. ముందు ముందు.. వేల కోట్ల నిధులు అవసరం. అమ్మఒడి కోసమే.. రూ. ఆరున్నర వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. చెల్లించాల్సిన బిల్లులు.. కొండల్లా పేరుకుపోతున్నాయి. ఐదు నెలల నుంచి ఒక్కటంటే.. ఒక్క అభివృద్ధి పని కూడా ప్రారంభించలేదు. ఈక్రమంలో.. డబ్బులు వచ్చే మార్గం.. ఒక్క భూములు అమ్మకమేనని.. ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ దిశగా అడుగులు వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఎకనామిక్ యాక్టివిటీనే లేనప్పుడు.. భూములు అమ్ముతామంటే.. మాత్రం.. ప్రభుత్వం కోరుకున్నంత డిమాండ్ ఎలా వస్తుందనే ప్రశ్న సహజంగానే వస్తుంది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. హైదరాబాద్‌లో ఐటీ బూమ్ ఉంది. అప్పట్లో.. నగరానికి సుదూరంలో ఉన్నట్లుగా ఉన్న… కోకాపేట లాంటి గ్రామాల్లో…ఎకరం యాభై కోట్లకు దాటిపోయింది. కానీ ఇప్పుడు.. ఏపీలో… నిన్నామొన్నటి వరకూ హాట్ కేక్‌గా ఉన్న అమరావతిలోనే… ఎకరం మూడు కోట్లు కూడా లేదు. ఇప్పుడు అసలు కొనేవారు లేరు. ఎంత పెద్దమొత్తంలో భూములమ్మిదే.. నవరత్నాలకు కావాల్సిన వేల కోట్లు.. జగన్మోహన్ రెడ్డి సమీకరిస్తారో వేచి చూడాలి..!