వరంగల్ ఉప ఎన్నికలు ప్రచారం కోసమని మళ్ళీ చాలా కాలం తరువాత తెలంగాణా జిల్లాలో అడుగుపెట్టిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు కురిపించిన తరువాత, ఈసారి కేసేఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తే ఆయన తమని ఎందుకు మోసం చేస్తున్నాడని ప్రశ్నించమని వరంగల్ ప్రజలను సలహా ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలు ఎన్నికలు కేవలం కేసీఆర్ మోజు వల్లనే ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దబడ్డాయని, కనుక ఈసారి కేసీఆర్ వస్తే ఆయనను గట్టిగా నిలదీయమని జగన్ వరంగల్ ప్రజలకు సలహా ఇచ్చారు.
కానీ నిజానికి ప్రశ్నించవలసినది కేసీఆర్ ని కాదు జగన్మోహన్ రెడ్డినే. రాష్ట్ర విభజన జరుగోతోందని గ్రహించగానే రాత్రికి రాత్రే తెలంగాణా నుండి పార్టీని ఎత్తేసి ఆంధ్రాకు తరలిపోయి సమైక్యాంధ్ర పోరాటాలు చేసి, మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత వచ్చిన జగన్మోహన్ రెడ్డిని అసలు తెలంగాణా ప్రజలు ఎందుకు నమ్మాలి? తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఇప్పుడు బిగ్గరగా గొంతు చించుకొని రంకెలు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇన్ని నెలలుగా ఎందుకు మౌనంగా చూస్తూ ఊరుకొన్నారు? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఒక్క వరంగల్ లోనే 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన ఒలకబోస్తున్న జగన్మోహన్ రెడ్డి, గత 16 నెలల కాలంలో తెలంగాణాలో అనేక వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా ఎందుకు స్పందించలేదు? హైదరాబాద్ లో ఉంటున్న ఆయన గుంటూరు, అనంతపురంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే రెక్కలు కట్టుకొని ఎగిరివెళ్లి వారి కుటుంబాలను పరామర్శించారు తప్ప పక్కనే ఉన్న తెలంగాణా జిల్లాలలో రైతు కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? తను స్పందించకపోయినా తెలంగాణా జిల్లాలలో పరామర్శయాత్రాలు చేసిన షర్మిల కూడా ఆ అభాగ్య రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆమె మాట్లాడకపోయినా తెలంగాణాలో వైకాప నేతలు ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణా ప్రజల తరపున నిలబడి పోరాడలేని వైకాపాకు ప్రజలు అసలు ఎందుకు ఓట్లు వేయాలి? అని వరంగల్ ప్రజలే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సి ఉంది.