విశాఖ దుర్ఘటనపై ఇంగ్లిష్ మీడియా చానెళ్లు నిర్వహించిన చర్చల్లో… పాల్గొన్న జగన్ సలహాదారులు ఇద్దరు… చర్చలు నిర్వహిస్తున్న వారి ప్రశ్నలకు ఆగ్రహం చెంది… అసహనం చెంది పక్కకు వెళ్లిపోయారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అలా వెళ్లిపోయేంత కఠినమైన ప్రశ్నలు ఆ చర్చా నిర్వాహకులు అడగలేదు. బేసిక్ ప్రశ్నలు వేశారు. దానికే సమాధానం చెప్పలేకపోయారు సలహాదారులు. రిపబ్లిక్ టీవీ చర్చలో… పీవీ రమేష్… టైమ్స్ నౌ చర్చలో జగన్కు మీడియా సలహాదారుగా ఉన్న దేవులపల్లి అమర్ ఇలా.. పక్కకు వెళ్లిపోయారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.
విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభుత్వం వేగంగా స్పందించింది. భారీగా పరిహారం ప్రకటించింది. అయితే.. అసలు ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు వ్యవస్థల పనితీరే ప్రధానంగా చర్చకు వస్తుంది. లోకల్లో రూ. కోటి నష్టపరిహారం.. అబ్బో అనిపిస్తుంది. దాని గురించే చర్చించుకోవచ్చు.. కానీ నేషనల్ మీడియా చూసే కోణం వేరేగా ఉంటుంది. వాళ్లు వ్యవస్థలపై చర్చిస్తారు. ఈ మాత్రం కసరత్తు లేకుండా.. సలహాదారులు మీడియా ముందుకెళ్లిపోయారు. సహజంగానే ఆర్నాబ్.. గద్దించి ప్రశ్నలు వేస్తూంటారు. ఆయనను తట్టుకోవాలంటే.. అంతకు మించిన వేగం చూపాలి. కానీ ఐఏఎస్ అధికారిగా అనేక కీలక హోదాల్లో పని చేసి.. రిటైరైన తర్వాత కూడా జగన్ టీంలో కీలకంగా ఉన్న పీవీ రమేష్.. కనీసం గట్టిగా సమాధానం చెప్పలేకపోయారు. బాధితులకు రూ. కోటి జగన్ ఇవ్వబోతున్నారని చెప్పడమే ఆయన ఎజెండాగా పెట్టుకున్నారు. చివరికి ఆర్నాబ్ వేసే ప్రశ్నలు తట్టుకోలేక… పీవీ రమేష్ పక్కకెళ్లిపోయారు. దీనిపై ఆర్నాబ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాసేపటికి మళ్లీ వచ్చినా… ఆర్నాబ్ ఆయనను సీరియస్గా తీసకోలేదు.
ఇక టైమ్స్ నౌ చానల్లో దేవులపల్లి అమర్ మరింత క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. అది కూడా.. చాలా సింపుల్ ప్రశ్నలకు. పరిశ్రమ యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు.. సీఎం కమిటీ వేశారని అమర్ చెప్పుకొచ్చారు. ఆ కమిటీ కాలపరిమితి ఎంత… ఒక నెల.. రెండు నెలలు..మూడు నెలలా.. అని చర్చా కార్యక్రమం నిర్వహించే జర్నలిస్ట్.. గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే.. జగన్ కు జాతీయ మీడియాతో ఎలా వ్యవహరించాలో.. సలహాలిచ్చే… మాజీ జర్నలిస్టు దేవులపల్లి అమర్… డిస్కషన్ నుంచి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో ఇదీ వైరల్ అయిపోయింది. తమ వాదనను గట్టిగా వినిపించలేని వారిని జగన్ ఎంటర్టెయిన్ చేస్తున్నారన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.